by Suryaa Desk | Sun, Nov 10, 2024, 07:44 PM
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కార్తీక మాసం ప్రారంభం కావటంతో భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడుతోంది. కార్తీక మాసం, ఆదివారం సెలవు రోజు కలసిరావటంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలు భక్త జనసంద్రంగా మారాయి. యాదాద్రీశుడి దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతోంది. స్వామి వారి నిత్య పూజలు, నిత్య కల్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేశారు.
యాదాద్రి పేరు మారింది. ఇక నుంచి అన్ని రికార్డుల్లో యాదాద్రికి బదులు యాదగిరిగుట్టగా వ్యవహారంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా గుట్టలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్.. తిరుమల తిరుపతి దేవస్థానంతరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. టెంపుల్ బోర్డు ఏర్పాటుకు అసరమైన చర్యలు, విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట బోర్డుకు టీటీడీ స్థాయిలో ప్రాధాన్యత ఉండేలా అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
యాదగిరి గుట్టలో గోశాలలో గోవుల సంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సూచించారు. గోవుల సంరక్షణకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భక్తులు గుట్టపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి విమాన గోపురం బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలన సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.