by Suryaa Desk | Sat, Nov 09, 2024, 07:03 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను నవంబర్ 6వ తేదీ నుంచే ప్రారంభించగా.. మూడు రోజుల పాటు స్టిక్కరింగ్ మాత్రమే జరిగింది. కాగా.. ఈరోజు (నవంబర్ 09) నుంచి కుటుంబ సర్వేను అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో.. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ఆ కుటుంబ వివరాలు సేకరిస్తూ సర్వే సాగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఓ గ్రామం బహిష్కరించింది. ఇందుకు సంబంధించి గ్రామస్థులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. అధికారులకు అందించారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు. ఈ సర్వేను బహిష్కరించటం వెనుక బలమైన కారణమే ఉంది. దిలావర్పూర్- గుండంపెల్లి గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా.. దానికి వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కానీ.. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవటంతో.. గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభం కాగా.. సర్వే నిర్వాహణ కోసం ఎన్యూమరేట్రలు గ్రామాల్లోకి వెళ్లగా.. ప్రజలు వారిని అడ్డుకున్నారు.
తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచే ఎత్తేంసే వరకు ఎలాంటి సర్వేలకు సహకరించేది లేదని గ్రామస్థులు తెగేసి చెప్తున్నారు. అధికారులకు తాము ఎలాంటి వివరాలు చెప్పేది లేదని.. తమ ఊరి నుంచి వెళ్లిపోవాలంటూ చెప్పుకొచ్చారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించేది లేదని గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడి అధికారులకు అందజేశారు. దీంతో.. చేసేదేమి లేక అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. ఇంటింటి సర్వే కోసం వెళ్తున్న ఎన్యుమరేటర్లకు పలు ప్రాంతాల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు ఊహించిన పరిణామాలు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లను సెక్యురిటీ సిబ్బంది ఇంటి లోపలికి అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో సర్వే సిబ్బందిపైకి పెంపుడు కుక్కలను వదులుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని.. అన్ని ఇండ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించినట్లు ప్రణాళిక శాఖ వివరించింది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మొత్తం 28,32,490 కుటుంబాలు ఉండగా.. వీటిని 19,328 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించారు. సర్వే కోసం 94,750 మంది ఎన్యూమరేటర్లను.. వారిపై 9,478 మంది సూపర్‌వైజర్లను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది.