by Suryaa Desk | Mon, Nov 11, 2024, 07:20 PM
నిత్యం రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటూ, ప్రత్యర్థులపై ఘాటు విమర్శలతో విరుచుకుపడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. తన మానవత్వా్న్ని చాటుకున్నారు. సమయానికి దేవుడిలా వెళ్లి.. ఓ యువతి ప్రాణాన్ని కాపాడారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం సింగాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతి లారీ కిందికి దూసుకెళ్లి.. ప్రమాదకర పరిస్థితిలో ఇరుక్కుపోయింది. లారీ టైరు కింద ఆమె జుట్టు ఇరుక్కుపోవటంతో.. బయటకు రాలేని క్షిష్టపరిస్థితి నెలకొంది. లారీని ముందుకో వెనక్కో కొంచెం జరిపినా ఆమె ప్రాణానికే ప్రమాదం వాటిల్లే ప్రమాదం. అదే సమయంలో.. అటుగా వెళ్తున్న బండి సంజయ్ కుమార్.. ఆ ప్రమాదాన్ని గమనించి.. సమయస్ఫూర్తితో ఆలోచించి.. ఆ యువతిని కాపాడారు.
మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే యువతి.. బైక్ మీద వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ప్రమాదవశాత్తు లారీ కింద ఇరుక్కుపోయింది. అయితే.. ఆమె జుట్టు లారీ చక్రాల కింద ఇరుక్కుపోవటంతో.. బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ యువతి.. ఓవైపు గాయాల నొప్పితో విలవిలలాడుతుండగా.. బయటకు రాలేక, ఏమవుతుందోనన్న ఆందోళనతో మరింత ఇబ్బంది పడింది. అదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న బండి సంజయ్ కుమార్.. ఈ ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్‌ను పక్కకు ఆపారు.
సమయస్ఫూర్తితో ఆలోచించి.. అటువైపు వెళ్తున్న లారీలను ఆపి జాకీలు, కత్తెరలు తెప్పించి దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. బండి సంజయ్‌ను చూసి.. స్థానికులు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. యువతి జుట్టు కత్తిరించి.. లారీ కింద నుంచి బయటకు తీశారు. బయటకు తీసేంత వరకు అక్కడే ఉండి ఆ యువతికి బండి సంజయ్ ధైర్యం చెప్తూనే ఉన్నారు. బయటకు తీసిన తర్వాత ఆమెకు నీళ్లు తాగించి.. అదే మార్గంలో వెళ్తున్న ఓ కారును స్వయంగా ఆయనే ఆపి.. అందులో బాధితురాలిని ఎక్కించి.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ కారు డ్రైవర్‌కు అన్ని విషయాలు వివరించి.. జాగ్రత్తగా తీసుకెళ్లి.. ఆస్పత్రిలో చేర్చించి తనకు సమాచారం అందించాలని తెలిపారు. అంతేకాకుండా.. ఆ యువతి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
సకాలంలో స్పందించి యువతి ప్రాణాలను కాపాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ సమయస్ఫూర్తిని పలువురు ప్రశంసిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేవుడిలా వచ్చి ఆ అమ్మాయికి ప్రాణ దానం చేశారని కొనియాడుతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఆ మహిళ లేచిన ఘడియ బాగుందని.. లేకపోతే కొంచెం మిస్సయినా ఆ లారీ చక్రం కింద జుట్టు కాకుండా తల పడేదని.. అప్పుడు పరిస్థితి ఊహించుకోవటానికే దారుణంగా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.