by Suryaa Desk | Mon, Nov 11, 2024, 09:47 PM
తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ కులగణనతో పాటు ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాతే.. తెల్లరేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు.
మరోవైపు.. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పౌరసరఫరాల శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఈ శాఖలో రూ.55 వేల కోట్ల అప్పుని రూ.11 వేల కోట్లకు తగ్గించామని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులతో పర్యవేక్షణ పెట్టామని చెప్పుకొచ్చారు. ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ధాన్యం సక్రమంగా కొనుగోలు చేయకపోతే వెంటనే తాము జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 2 నెలలైనా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని.. కానీ తాము మాత్రం ధాన్యం సేకరించిన రెండు మూడు రోజుల్లోనే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల మిల్లర్లు సహాయనిరాకరణ చేస్తున్నారని.. మరికొన్ని చోట్ల జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఉత్తమ్ మండిపడ్డారు. మిల్లర్లు కొనుగోలు చేయకుంటే స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ స్పేస్‌ను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. మిల్లర్లు కొనుగోలు చేయకుంటే సర్కారే ధాన్యం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ అవసరాల కోసం ఏమైనా మాట్లాడుతునందని.. కానీ పౌరసరఫరాల శాఖ గతంలో కంటే ప్రస్తుతం చాలా మెరుగ్గా పని చేస్తుందని చెప్పుకొచ్చారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ కావాలనే రాద్ధాంతం చేస్తుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మూసీ పునరుజ్జీవాన్ని నల్గొండ ప్రజలు స్వాగతిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.