by Suryaa Desk | Sat, Nov 09, 2024, 06:55 PM
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు.. మూసీ ప్రక్షాళన విషయం అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, తీవ్ర ఆరోపణలు నడుస్తున్న క్రమంలోనే.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు (నవంబర్ 08న) సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేయటమే కాకుండా.. అదే సందర్భంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటైనా వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు.
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనగా.. కేసీఆర్ సమక్షంలో సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, నటుడు రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్లకు కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో మాట్లాడిన కేసీఆర్.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, హైడ్రా కూల్చివేతలు, బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఘాటుగా స్పందించారు.
"అన్ని జిల్లాల్లో జనం చెబుతున్నారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనమే అధికారంలోకి వస్తాం. అందులో అనుమానమే లేదు. ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమయ్యింది. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయి. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలి. సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలి. కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు. తిట్టడం మాకు కూడా వచ్చు. ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా.
ప్రజలను కాపాడాల్సింది పోయి, భయపెడతారా. అరెస్ట్‌లకు భయపడేది లేదు. ప్రజలు మీకు బాధ్యతను అప్పగించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. గత ఎన్నికల్లో మనం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే.. కానీ 90 శాతం ఎవరు ఆడగకున్నా పనులు చేసి చూపించాం." అంటూ కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కాగా.. తెలంగాణలో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి ఓవైపు మూసీ ప్రక్షాళన అంశం.. మరోవైపు హైదరాబాద్‌లో ఫార్ములా-1 కార్ రేసింగ్ వివాదంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం.. ఇలా పలు అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. మూసీ ప్రక్షాళన చేసి తీరతామని.. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు ఎక్కించి తొక్కిస్తానంటూ కేటీఆర్, హరీష్ రావులపైనే కాదు బీజేపీ నేతలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తే కేసీఆర్ కుక్క చావు చస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.