by Suryaa Desk | Sun, Nov 10, 2024, 06:49 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు రాగానే త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలంలో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను పరిశీలించారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం, పి. ఏ .సి.ఎస్ . ధాన్యం కొనుగోలు , భూపతిపూర్ గ్రామంలోని ఐకెపి కొనుగోలు కేంద్రం, కాట్నపల్లి గ్రామంలోని ఐకెపి కొనుగోలు కేంద్రం, పి. ఏ .సి.ఎస్ కేంద్రం , ఇంటింటి సర్వే, పెద్దపల్లి పట్టణం ధర్మారం రోడ్డు లోనీ 18 వ వార్డ్ లో ఇంటింటి సర్వే, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద వచ్చిన ధాన్యాన్ని ప్యాడి క్లీనర్ల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. నాణ్యత ప్రమాణాలను పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సన్న రకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు లేకుండా చూడాలని అన్నారు. హమాలీల సమస్య లేకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ పక్కగా చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని, ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కావడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి రోజు 15 కుటుంబాల వివరాలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు.అనంతరం పెద్దపల్లిలోని మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ ల్యాబ్, ఓపి విభాగాన్ని తనిఖీ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ లు త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆస్పత్రి ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సుల్తానాబాద్ ఏపీఎం శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.