by Suryaa Desk | Fri, Sep 20, 2024, 12:34 PM
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆరేళ్ల గీతిక అనే చిన్నారి మృతదేహాన్ని తల్లిదండ్రులు 3 గంటలుగా చేతులపై ఎత్తుకొని ఎదురు చూసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.ఇది అమానవీయ ఘటన అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి అవమానం. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చిందని మండిపడ్డారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణలో రాష్ట్ర వైద్యారోగ్య వ్యవస్థ పూర్తిగా నాసిరకంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ కేర్ మోడల్.. జీవితంలో గౌరవం లేదు.. మరణంలోనూ గౌరవం లేదు. ఇది నేరపూరిత నిర్లక్ష్యం.. అని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ నెల 1వ తేదీన ఏటూరునాగారం మండలం ఆకులవారి గణపురం గ్రామానికి చెందిన గీతిక(6) అనే చిన్నారి విషజ్వరంతో వరంగల్ ఎంజీఎంలో చేరింది. చికిత్స పొందుతూ నిన్న ఉదయం మరణించింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలుగా చేతులపై ఎత్తుకొని ఎదురుచూశారు. చివరకు ఓ వ్యక్తి గొప్ప మనసు చాటుకున్నారు. తన సొంత ఖర్చులతో ప్రయివేటు అంబులెన్స్ సమకూర్చి.. గీతిక మృతదేహాన్ని గణపురం గ్రామానికి తరలించారు.