by Suryaa Desk | Fri, Sep 20, 2024, 10:17 PM
దేశంలోనే రెండో అతిపెద్ద లింక్ ఫ్లైఓవర్ యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మెకలై స్టీల్‌తో ఈ లింక్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది ఇండియాలోనే ఇది రెండో అతి పొడవైనదని.. మూడు నెలల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బుధవారం (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA), రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇప్పటి వరకు కేవలం ఎగ్జిట్ ఫ్లైఓవర్ పైనే ఆధారపడి ఆలయానికి వచ్చే భక్తులకు ఈ లింక్ బ్రిడ్జి ఉపశమనం కలిగిస్తుందని మంత్రి సురేఖ అన్నారు. యాదాద్రి దేవాలయం సమీపంలో 64 మీటర్లతో నిర్మించనున్న ఈ వంతెనను రానున్న మూడు నెలల్లో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. యాదాద్రి గర్భగుడి విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులపై కూడా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బంగారు తాపడం పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక యాదాద్రికి సమీపంలోని రాయగిరిలో దాదాపు 20 ఎకరాల్లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్మాణ పనులను మొదలుపెడతామన్నారు. రూ.43 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ వేద పాఠశాలకు గోవిందహరి ఛైర్మన్‌గా ఉంటారన్నారు.
ఇక తెలంగాణలోని మూడు టెంపుల్ టూరిజం సర్క్యూట్‌లలో త్వరలో భక్తులకు వీఐపీ దర్శనాన్ని ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి సురేఖ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటకశాఖ, దేవాదాయశాఖల సహకారంతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడు టెంపుల్ సర్క్యూట్‌లలో భక్తులకు వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కొమురవెల్లి ఒక సర్క్యూట్ కాగా.. మన్యంకొండ, శ్రీరంగాపూర్, అమ్మపల్లి, జోగులాంబ ఆలయాలు రెండో సర్క్యూట్‌లో.. డిచ్‌పల్లి ఆలయం, బాసర, కామారెడ్డిలోని ప్రముఖ ఆలయాలను మూడో సర్క్యూట్‌లో భాగం చేశామన్నారు. ఈ ఆలయాలను సందర్శించే వీఐపీ భక్తులకు వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్, గైడ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భక్తులకు ఈ ఆలయాల్లో ఎక్కడికి వెళ్లినా ఆలయ జ్ఞాపికను అందించి సత్కరిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.