by Suryaa Desk | Sat, Sep 21, 2024, 07:30 PM
గురుకుల పాఠశాలల్లో పాము కాటు ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు వణికిపోతున్నారు. కిందటి నెల జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముకాట్లకు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. తాజాగా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మరో బాలుడు పాము కాటుకు గురయ్యాడు. జ్వరంతో బాధపడుతూ హాస్టల్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న బాలుడిని నాగుపాము కాటేసింది. విద్యార్థి ట్రంకు పెట్టె మాటున పడగ విప్పి బుసలుకొట్టిన పామును పాఠశాల సిబ్బంది గుర్తించారు. బాలుడిని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముస్తాబాద్ మండలంలోని సేవాలాల్‌తండాకు చెందిన దరావత్ రోహిత్ (11) గాలిపెల్లి బాలుర గురుకుల హాస్టల్‌లో ఉంటూ జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం (సెప్టెంబర్ 20) అస్వస్థతకు గురైన రోహిత్.. పాఠశాలకు వెళ్లిన కాసేపటికే వాంతులు వస్తున్నాయని హాస్టల్ గదికి వచ్చి పడుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న నాగు పాము అతడి చేతికి కాటు వేసింది. పాము కాటేసిందని కేకలు వేస్తూ బయటకి పరుగెత్తుకొచ్చాడు. హాస్టల్ వాచ్‌మెన్ బాలుడిని వెంటనే ఇల్లంతకుంట ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
గ్రామస్థులతో కలిసి హాస్టల్ సిబ్బంది.. హాస్టల్‌లో విద్యార్థుల పెట్టెల చాటున ఉన్న పామును చంపేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆస్పత్రికి ఫోన్ చేసి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ గౌడ్.. వసతి గృహానికి వచ్చి పరిశీలించారు. బాలుడు కోలుకుంటున్నాడని, పూర్తిగా కోలుకునేందుకు 4, 5 రోజులు పడుతుందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఆగస్టులో వరుస పాముకాట్లు అలజడి సృష్టించాయి. 10 రోజుల వ్యవధిలో పాముకాట్లకు గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరి కొంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. తొలుత ఫుడ్ పాయిజన్ అయిందనే ఆరోపణలు వచ్చినా.. పాముకాటుకు గురై ఉండవచ్చునని డాక్టర్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ విద్యాసాగర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ఉన్న దుర్భర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, అధికార కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ అంశం మాటలయుద్ధానికి దారితీసింది. గురుకుల పాఠశాలల్లో విష జ్వరాలతో కొంత మంది విద్యార్థులు మృతి చెందడం మరింత ఆందోళన కలిగించింది. గురుకుల విద్యా సంస్థల్లో పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణపై విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి గురుకుల పాఠశాలలను సందర్శించారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించి బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.