by Suryaa Desk | Fri, Nov 08, 2024, 11:40 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొడుకు తీసుకున్న డబ్బు తిరిగివ్వట్లేదని ఓ కాంట్రాక్టర్ అతని తల్లిని ఎత్తుకెళ్లిన ఘటన.. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం కోడిముంజ గ్రామంలో చేటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివాస్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కాగా.. మహారాష్ట్రకు చెందిన లాలు దేవకర్ అనే కాంట్రాక్టర్.. కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనిని కాంట్రాక్టు తీసుకున్నాడు. ఈ పనికి కూలీలు అవసరం ఉండగా.. శ్రీనివాస్‌తో పాటు అతడి సోదరున్ని సంప్రదించారు. కాగా.. ప్రస్తుతం శ్రీనివాస్, అతని సోదరుడు చత్తీస్‌గఢ్‌లో కూలీ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన కూలీలను పురమాయించేందుకు చత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలతో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం లాలు దేవకర్ రూ.3.80 లక్షలను చెల్లించాడు కూడా.
అయితే.. ఒకట్రెండు రోజులు కూలీలు వెళ్లి పని చేసి.. మళ్లీ తిరిగి వెళ్లలేదు. ఎన్నిరోజులైనా కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవకర్.. శ్రీనివాస్, అతడి సోదరునికి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో.. లాలు దేవకర్ పలుమార్లు ఫోన్ చేసినా సరిగ్గా స్పందించకపోవటం, కూలీలను పంపించకపోవటంతో.. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని శ్రీనివాస్ మీద ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. ఏం చేసినా.. అటు కూలీలను పంపించకా.. ఇటు డబ్బులు తిరిగివ్వకపోవటంతో.. బుధవారం (నవంబర్ 06న) రోజున లాలు దేవకర్ ఏకంగా శ్రీనివాస్ ఇంటికి వచ్చి కూర్చుకున్నాడు. ఆ సమయంలో.. శ్రీనినివాస్, అతని సోదరుడు ఇద్దరూ ఇంటి దగ్గర లేకపోవటంతో.. డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు.
ఏం చేసినా తన డబ్బులు తిరిగి ఇచ్చేలా లేరని భావించిన లాలు దేవకర్.. ఇంట్లో ఉన్న శ్రీనివాస్ తల్లి భీమాబాయ్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. తనకు రావాల్సిన డబ్బులు మొత్తం చెల్లించి.. తల్లిని తీసుకెళ్లాలని వార్నింగ్ ఇచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న భీమాబాయ్‌ను ఎత్తుకెళ్తున్న క్రమంలోనే.. కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా.. లాలు దేవకర్, అతని అనుచరులు ఏమాత్రం కనికరం చూపించకుండా.. దౌర్జన్యంగా భీమాబాయ్‌ను ఎత్తుకెళ్లారు.
దీంతో.. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీర ప్రసాద్ కేసు నమోదు చేసుకుని ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. భీమా బాయ్‌ను ఎత్తుకెళ్లిన దుండగులు మహారాష్ట్ర వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. వారి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.