by Suryaa Desk | Sat, Nov 09, 2024, 01:44 PM
ఇదే నిజం, జోగిపేటః రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే కార్యక్రమంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రైనీ అడిషనల్ కలెక్టర్ మనోజ్‌కుమార్ అన్నారు. అందోలు మండలం డాకూరు గ్రామంలో సర్వే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సర్వేలో అడిగే ప్రశ్నలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్ధిక వివరాలు, స్థిరాస్తి వివరాలు తెలియజేస్తే ఎక్కడ తమకున్న రేషన్ కార్డులను తీసేస్తారేమోనన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.
ఈ సర్వే రేషన్ కార్డులు తొలగించడమో...ప్రజలకు నష్టం కల్గించడానికి ఈ సర్వేను చేపట్టడంలేదన్న విషయాన్ని ఎన్యూమరేటర్లు కూడా ప్రజలకు తెలియజేస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితి తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి వారిని ఏ విధంగా ఆదుకోవాలన్న విషయంపై చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్యూమరేటర్ల ప్రశ్నలకు ఎలాంటి ఆందోళన చెందకుండా సమాధానాలు ఇవ్వాలన్నారు. రాజకీయంగా ఎమైనా పదవులు నిర్వహించి ఉంటే తెలియజేయాలని, రాజకీయ పార్టీ వివరాలు చెప్పాలన్న కాలమ్ సర్వేలో లేదని ఆయన అన్నారు. 9వ తేది నుంచి ఇంటింటి సర్వే ప్రారంభిస్తారని, 6,7,8 తేదీల్లో ప్రతి ఇంటికి సర్వేకు సంబంధించిన స్టిక్కర్‌లు అంటించే కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఈనెలాఖరులోగా సర్వే పూర్తి అవుతుందని ఆయన అన్నారు. కులానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని తెలిపారు. అందోలు ఎంపీడీఓ ఆయన వెంట ఉన్నారు.