![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 12:48 PM
మీ ఇంట్లో పనికిరాని పాత మొబైల్‌ను ఇస్తే ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని మీ ఊళ్లో తిరుగుతున్నారా? ప్లాస్టిక్ వస్తువులకు ఆశపడితే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.ఇలాగే ఆటోలో వీధి వీధి తిరుగుతూ పాత మొబైల్స్‌ను సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రట్టయ్యింది. ఆరుగురు నిందితులతో కూడిన బిహార్ ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు తెలిపారు.పాత, పనికిరాని మొబైల్స్‌ను ఇస్తే ప్లాస్టిక్ వస్తువులను ఇస్తామని బిహార్‌కు చెందిన ముఠా సభ్యులు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతారు.ఊరూరు తిరిగి పాత ఫోన్లను సేకరిస్తారు. అనంతరం ఫేక్ ఐడీ కార్డులతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి, వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఆ ఫోన్ నంబర్లతో అమాయక ప్రజలకు ఫోన్ చేసి, బ్యాంకు అధికారులమని నమ్మించి డబ్బులు కాజేస్తుంటారు. ఈ ముఠా గురించి తెలుసుకున్న ఆదిలాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసకున్నారు.ఆరుగురు ముఠా సభ్యలను అరెస్టు చేసి, వారి దగ్గర నుంచి 2015 పాత మొబైల్స్, 105 సిమ్ కార్డులు, 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని సభ్యులు ఇప్పటికే రాష్ట్రంలోని 12 వేల మొబైల్స్‌ను సేకరించి, వివిధ సైబర్ నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.