![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 11, 2025, 04:32 PM
రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో వేశారని, కానీ రేవంత్ రెడ్డి కనీసం బీఆర్ఎస్ నేతలపై ఆ ప్రయత్నం కూడా చేయడం లేదని నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో పుష్ప, హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల అంశం తప్పితే ఏమీ లేదని విమర్శించారు.రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక క్రమశిక్షణ లేని జీరో పరిపాలన సాగుతోందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, విద్యా భరోసా కార్డు, చేయూత, ఆరోగ్యశ్రీ, తులం బంగారం ఇలా అన్ని హామీలను విస్మరించారని అన్నారు. రోజురోజుకూ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన ఉన్న దొంగలే ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారని ఆరోపించారు.తెలంగాణలో ప్రతిపక్షం ఫామ్ హౌస్‌లో పడుకుందని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు ప్రతిపక్ష పదవిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యవస్థను విధ్వంసం చేసి దోచుకు తిన్నారని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ నేతలను తెలంగాణలో కాళ్లు పెట్టనివ్వనని రేవంత్ రెడ్డి ఇటీవల అహ్మదాబాద్ లో వారి పార్టీ సమావేశంలో అన్నారని గుర్తు చేశారు. కానీ, తాజాగా మల్క కొమురయ్య, అంజిరెడ్డి కాళ్లు పెట్టేశారని వ్యాఖ్యానించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపించడం తప్పితే, అవినీతికి పాల్పడిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.