|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 02:22 PM
జలమండలి పరిధిలో తమ సేవలను సమర్థవంతంగా అందించే విధంగా క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి.. ప్రజలనుంచి నేరుగా సమస్యలు తెలుసుకునే విధంగా 'జలమండలి.. బస్తీ బాట ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.అందులో భాగంగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉదయం 6 గంటలకు శేరిలింగంపల్లి వార్డులోని శంకర్ నగర్, హుడా కాలనీ, దీప్తి శ్రీ నగర్, మియాపూర్ ప్రాంతంలో పర్యటించారు. శంకర్ నగర్ లో నీటి సరఫరా సమయంలో పలు ఇండ్లలో తనిఖీలు చేసి నీటి నాణ్యతను పరిశీలించారు. నేరుగా వినియోగదారులతో ముచ్చటించిన జలమండలి ఎండీ సరఫరా సమయాలు, సరిపడా నీరు సరఫరా అవుతున్నాయో, లేదో అడిగి తెలుసుకున్నారు. దానికి వారు అవసరానికి సరిపోతున్నాయని ఎండీ చెప్పారు. మరో ఇంటిని సందర్శించిన ఎండీ తాగునీటితో ప్రాంగణం కడిగి నీటిని వృథా చేయడంతో యజమానిని పిలిచి.. విలువైన నీటిని వృథా చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసారు. నీటి ప్రాంగణాలు కడగటానికి మాపు లేదా వస్త్రాన్ని వినియోగిస్తే నీటి వృథా ఉండదని హితవు పలికారు. ఇది మళ్ళీ పునరావృత్తం అయితే పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు.
తదుపరి.. మరొక ఇంటిలో బోరు నీటిని మొక్కలకు, ప్రాంగణం కడగడం చూసిన ఎండీ ఇంకుడు గుంత నిర్మించేంత ఖాళీ స్థలం ఉండటంతో ప్రాంగణంలోని వృథా నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించుకోవాలని సూచించారు. రూఫ్ వాటర్, వాన నీటిని భూమిలోకి ఇంకించేవిధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం హుడా కాలనీలో సీవరేజ్ మ్యాన్ హోల్ డీ-సిల్టింగ్ పనులను పరిశీలించిన ఎండీ.. మాల్ హోల్ లలో వెలువడ్డ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. రోడ్డుకు సమాంతరంగా లేని మ్యాన్ హోళ్ళను, ధ్వంసమైన మ్యాన్ హోళ్ళను గుర్తించి పునర్నిర్మాణం చేయమని సూచించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించమని చెప్పారు.
అనంతరం మియాపూర్ ప్రధాన రహదారిపై సీవరేజ్ చొకేజి అయిన మ్యాన్ హోల్ వద్ద డీ-సిల్టింగ్ పనులను పరిశీలించారు. మాన్ హోల్ చొకేజి కారణాలను ఆరాతీయగా.. ప్రధాన రహదారిపై కొత్త రోడ్డు నిర్మించే సమయంలో సంబందించిన శాఖ మ్యాన్ హోళ్ళను మూసివేశారని, దాంతో సీవరేజ్ లైన్ లో సిల్ట్ చేరి సమస్య తలెత్తిందని.. కొత్త రోడ్డు నిర్మాణంతో మ్యాన్ హోళ్ళ గుర్తింపు కష్టతరంగా మారిందని అధికారులు ఎండీకి వివరించారు. దానికి ఎండీ తాత్కాలికంగా సీవరేజ్ లైన్ ను సమీపంలోని ట్రంక్ మెయిన్ కు మళ్ళించి సమస్యను తగ్గించాలని సూచించారు. శాశ్వత పరిష్కారంగా చొకేజి అయిన లైనుకున్న మ్యాన్ హోళ్ళను గుర్తించడానికి మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు చెప్పారు. జలమండలి పరిధిలో తాగునీటి, మురుగునీటి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి 'జలమండలి.. బస్తీ బాట' కార్యక్రమాన్ని రూపొందించిందని, ఇందులో భాగంగా ఎండీ నుంచి మేనేజర్ వరకు ప్రతీ మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఉదయం 7 గంటలనుంచి 10 గంటల వరకు బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటారని చెప్పారు.
ఈ పర్యటనలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడి.. మంచినీరు, సీవరేజ్ సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తారని చెప్పారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించుకుంటారని చెప్పారు. అలాగే, నీటి వృథాను తగ్గించి, భూగర్భ జలాలను పెంచే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకునే విధంగా అవగాహన కల్పిస్తారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాస రెడ్డి సీజీఎంలు, జీఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు.