by Suryaa Desk | Sun, Aug 11, 2024, 09:26 PM
తెలంగాణ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. మరో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణశాఖ రిపోర్టు ప్రకారం.. నేడు నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ మేరకు వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వానలు కురిసే సమయంలో బయటకు వెళ్లకపోటమే ఉత్తమమని చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. సాయంత్రం తర్వాత జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నగరంలో కొదికొద్ది రోజులుగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. మధ్యాహ్నం కాస్త ఎండగా అనిపించినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు పలు ప్రాంతాలు అతాలకుతలం కాగా.. మరోసారి వర్షం హెచ్చికలతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉండగా.. గతకొన్ని రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో వర్షాలు కురవకపోటవంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. జులైలో మాత్రం వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు వారాలుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండు కుండలా మారాయి. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.