by Suryaa Desk | Sun, Aug 11, 2024, 09:24 PM
"ఎలాగూ ఆదివారం.. స్కూల్‌కు సెలవు కదా.. ఇంటి దగ్గర ఉంటే ఒకటే అల్లరి.. అమ్మను సతాయిస్తారు. అలా సరదాగా నాతో వచ్చేయండి.. రైల్వే స్టేషన్‌లో కాసేపు ఆడుకోవచ్చు." అంటూ తన ఇద్దరు కూతుళ్లను రైల్వేలైన్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి రైల్వేస్టేషన్‌ను తీసుకెళ్లాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుకున్న ఆ చిన్నారులు.. నిమిషాల్లోనే రైలు ఢీకొని మాంసపు ముద్దలుగా మారిపోయారు. తన కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో ఆ తండ్రి కూడా ప్రాణాలు వదిలిన విషాదకర ఘటన.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వేస్టేషన్ వద్ద జరిగింది.
రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసముంటున్న కృష్ణ.. రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. ఈరోజు ఆదివారం (ఆగస్టు 11న) సెలవు దినం కావడంతో పిల్లలను తనతో పాటు వెంట తీసుకుని వెళ్లాడు. పిల్లలను పక్కన ఓ ట్రాక్‌పై కూర్చోబెట్టి పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలోనే.. అనుకోకుండా ట్రాక్‌పైకి ట్రైన్ రావడంతో.. ఆ ట్రాక్ మీద ఉన్న తన పిల్లలు ఉన్నారని గుర్తొచ్చి.. కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే.. అప్పటికే వేగంగా వచ్చిన రైలు.. ఆ ముగ్గురిని ఢీకొట్టడంతో.. ఇద్దరు కూతుళ్లతో పాటు ఆ తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు.
రైల్వే ట్రాక్‌పై ముగ్గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసిన.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని కృష్ణ భార్యకు తెలియజేయగా... ఆ ముగ్గురి మృతదేహాలను చూసి.. ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. ఆమె.. నిస్సహయా స్థితిని చూసి.. స్థానికులు కూడా కంటతడి పెట్టుకున్నారు.
సెలవు రోజున సరదాగా తనతో తీసుకెళ్లటమే ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. పిల్లల్ని ప్రమాదకరంగా ట్రాక్ మీద కూర్చోబెట్టి పనిలో నిమగ్నమవటమే ఆ తండ్రి చేసిన అతిపెద్ద తప్పుగా మారింది. రోజులాగే.. తాను పనిలో ఉన్నప్పుడు వచ్చీ పోయే రైళ్ల శబ్దం అలవాటు కావటంతో.. ఈరోజు తనతో పాటు తన పిల్లలు కూడా ఉన్నారని.. వాళ్లు అవతలి ట్రాక్ మీద ఉన్నారన్న విషయాన్ని ఆ తండ్రి ఆలస్యంగా గుర్తించటంతో.. ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు.