by Suryaa Desk | Fri, Sep 20, 2024, 08:17 PM
ఇల్లు లేని పేదలకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను సర్కారు వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నారని, ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. . అంతేకాదు, దీనిని కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్, రూరల్) పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పలు అంశాలపై ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించిన సంగతి తెలిసిందే.
వాటిలో ఇళ్లకోసం దాదాపు 82 లక్షలు దరఖాస్తు రాగా. పట్టణ పరిధిలో 23.5 లక్షలు, గ్రామీణంలో 58.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడత అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో.. సొంత స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత.. రెండో విడతలో స్థలం లేనివారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, స్థలం లేనివారికి చోటు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
ఈ హామీ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇండ్లను కేటాయించాలని నిర్ణయించింది. రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇండ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచింది. ఇళ్ల నిర్మాణ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.9,184 కోట్లు కేటాయించగా, పీఎంఏవై పథకం కింద కేంద్రం నుంచి దాదాపు రూ.4,600 కోట్లు అందుతాయని అంచనా వేసింది.
ఇక, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇళ్ల నిర్మాణ పథకాల మార్గదర్శకాలు, విధివిధానాలపై గృహనిర్మాణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికార బృందాలు పర్యటించి, ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. ఇందిరమ్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా? కాదా? అనేది ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలించి నిర్దారించనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన, తనిఖీలు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం గ్రామం, పట్టణం, మున్సిపాలిటి, వార్డులకు ప్రత్యేక పరిశీలన అధికారి, పలు బృందాలతో కలిసి వెళ్లి ధ్రువీకరించనున్నారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించేలా ఒక ప్రత్యేక ఫార్మాట్‌ను ప్రభుత్వం సిద్ధంచేసినట్టు తెలిసింది.
దాని ప్రకారం.. ఆధార్, తెల్ల రేషన్ కార్డులను పరిశీలించి.. గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు. అనంతరం ఇంటి స్థలం ఉన్న వారైతే అది సొంతమేనా, డి-పట్టానా లేదా పూర్వీకుల నుంచి సంక్రమించిందా అనే వివరాలను తీసుకుంటారు. ఒకవేళ ఇంటి స్థలం లేనివారికి ఇంటి స్థలం ఇవ్వాలని ఫ్రొఫార్మాలో వివరాలను నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకోనున్నట్టు తెలిసింది.