by Suryaa Desk | Fri, Sep 20, 2024, 08:15 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలుస్తోంది. హైడ్రాకు (Hydra) చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సుకు క్యాబినెట్ ఆమోదించనుంది. అలాగే, ధరణిపై కమిటీ ఇచ్చిన 54 సిఫారసులపైనా చర్చించి, అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే కులగణనపై కూడా చర్చ జరగనున్నట్లు భోగట్టా. అలాగే, పలు విశ్వవిద్యాలయాలకు పేర్ల మార్పుపై కూడా చర్చించనున్నట్లు తెలియవచ్చింది.
హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత సురవరం ప్రతాపరెడ్డి పేరు, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, పోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి సంబంధించి మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది. కొత్తగా 225 గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనంపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది
వీటితో పాటు వరద సహాయక చర్యలు, రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎజెండా లిస్ట్ పెద్దదిగా ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. వరదలు, హైడ్రా ఆర్డినెన్స్, బీసీ కులగణన వంటివాటిపై కూలంకషంగా చర్చించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇటీవలి ఖమ్మం, నల్లగొండ జిల్లాలో సంభవించిన వరదల వల్ల దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా పంట, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. దీనిపైనా మంత్రివర్గం చర్చించనుంది. హైడ్రాకు విశేషాధికారాలు కల్పించేలా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిసి.. తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని తీసుకురానుంది.
కాగా, రాష్ట్రంలో బీసీ కుల గణన పూర్తిచేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇది పూర్తయితే తప్ప.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, పాలక వర్గాలు ఏర్పడితేనే కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి. ఈ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలకు ప్రతిబంధకంగా ఉన్న బీసీ కుల గణనను చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే, ‘రికార్డ్ ఆఫ్ రైట్స్-2024’ ముసాయిదా అంశం కూడా చర్చకు రానున్నాయి. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా క్యాబినెట్ భేటీ ఎజెండాలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.