by Suryaa Desk | Sat, Sep 21, 2024, 11:20 PM
లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు ఆయన్ను గోవాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20న ఉప్పరలపల్లి కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ వ్యవహరంలో జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జానీ మాస్టర్‌తో పాటుగా అయేషా కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషాపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధమయ్యారు. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. జానీ మాస్టర్‌తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్ళిన భార్య అయేషా..ఆమెను వేధించినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో నిందితురాలుగా ఆమెను కూడా చేర్చాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక జానీ మాస్టర్‌ని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరుతున్నారు. ప్రస్తుతం అతడు రిమాండ్‌లో ఉండగా.. పది రోజుల పాటు జానీ మాస్టర్‌ని కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా, ఈ వ్యవహారంలో మరింత మంది బాధితులు బయటికు రానున్నట్లు సమాచారం. మరో ఇద్దరు డాన్సర్లతో పాటుగా చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. వారు నోరు విప్పితే జానీ మాస్టర్‌కు చిక్కులు తప్పకపోవచ్చు.
ఇక జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక వేధింపుల కేసులో అతడు నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు. '2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉంది. 2020లో ముంబైలోని ఒక హోటల్‌లో ఆమెపై మెుదటిసారి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దురుద్దేశంతోనే తన వద్ద అసిస్టెంట్‌గా బాధితురాలని చేర్చుకున్నాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. 2020 నుంచి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరించాడు. సినిమా ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆమెరు అవకాశాలు లేకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించింది.' అని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.