by Suryaa Desk | Sat, Sep 21, 2024, 10:00 PM
సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సింగరేణి కార్మికుల అంశంపై స్పందించారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారని పేర్కొన్నారు. సంస్థ గడించిన లాభాల ఆధారంగా కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా బోగస్ చేశారని రాసుకొచ్చారు. లాభాల వాటలో 50 శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండించారు. ఎంతో శ్రమించి సంస్థకు డబుల్ ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను ప్రభుత్వం అడియాసలు చేసిందని పేర్కొన్నారు.2022-23 గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు రూ.2,222 కోట్లు అయితే 32 శాతం అనగా దాదాపు రూ.710 కోట్లు కార్మికులకు అందించామని, కానీ ఈ ఏడాది 2023-24కు వచ్చిన లాభాలు రూ.4,701 కోట్లు అయితే ప్రభుత్వం చెప్పిన విధంగా 33 శాతం లాభాలు పంచితే మొత్తంగా దాదాపు రూ.1,550 కోట్లు కార్మికులకు రావాల్సి ఉందన్నారు. కానీ రూ.796 కోట్లు మాత్రమే కార్మికులకు ఇచ్చారన్నారు. ఇది కేవలం 16.9 శాతమే అని తెలిపారు. కార్మికులకు హక్కుగా రావాల్సిన మిగతా వాటా రూ.754 కోట్లు ఎటు వెళ్లాయో చెప్పాలన్నారు.లాభాలేమో రూ.4,701 కోట్లు చూపించి, కేవలం రూ.2,412 కోట్లలో 33 శాతం బోనస్‌ను ప్రకటించడం ఏమిటి? మిగతా రూ.2,289 కోట్లకు బోనస్‌ను ఎగ్గొట్టడం ఏమిటి? ఆల్‌టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా గతం కంటే ఒక్కో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా? కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు.కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతోందని, నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బటాలో పట్టించారని తెలిపారు. కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను పెంచుతూ వచ్చినట్లు వెల్లడించారు.సమైక్య రాష్ట్రంలో 2008 నుంచి 2011 వరకు సింగరేణి లాభాల్లో కార్మికులకు కేవలం 16 శాతం వాటా మాత్రమే ఇచ్చారని, తెలంగాణ వచ్చాక కేసీఆర్ దానిని 21 శాతానికి పెంచారని గుర్తు చేశారు. 2022-23లో ఏకంగా 32 శాతం వాటాను ఇచ్చారని తెలిపారు. వెలుగు అందించే సింగరేణి కార్మికుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటిని నింపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్మికులకు సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే ఇప్పుడే ఎక్కువగా జరుగుతోందని పేర్కొన్నారు.