|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 06:21 PM
తెలంగాణలో పండగైనా.. పబ్బమైనా.. మంచైనా.. చెడైనా.. వేడుక ఏదైనా సరే.. నాన్‌వెజ్ లేకుండా అది పూర్తి కాదు. తెలంగాణలో మాంసం కేవలం ఆహారం కాదు.. అది ఒక సంప్రదాయం. చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదనే మాట అక్షర సత్యం. పండగల రోజున ఇల్లంతా పసందైన మాంసం కూరల వాసన గుబాళించాల్సిందే. వేడి వేడి మాంసం వంటకాలతో 'పండగ చేసుకోవడం' తెలంగాణ సంప్రదాయంలో అంతర్భాగం. పండగల సమయంలోనే కాకుండా వీకెండ్ డేస్‌లోనూ మాంసాన్ని ఇష్టంగా తింటుంటారు. అందుకే ఇక్కడ మాంసం వినియోగం రికార్డు స్థాయిలో ఉంటుంది.
నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం.. దేశంలో మాంసాహార వినియోగం పరిమాణం పరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో సగటున ఒక్కొక్కరు నెలకు 2 కిలోల మాంసం (సంవత్సరానికి దాదాపు 24 కిలోలు) తింటున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు (నెలకు 0.6 కిలోలు లేదా సంవత్సరానికి 7 కిలోలు) కంటే మూడు రెట్లు అధికం అని NMRI, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మాంసాహారం తినేవారి సంఖ్యాపరంగా చూసుకుంటే తెలంగాణ దేశంలోనే ఏడో స్థానంలో ఉందని జాతీయ ఆరోగ్య, కుటుంబ సర్వే (NFHS) నివేదిక తెలిపింది. టాప్ ప్లేస్‌లో నాగాలాండ్ ఉండగా.. ఆ రాష్ట్ర జనాభాలో 99.8% మంది మాంసాహారం తింటున్నట్టు వెల్లడైంది. తెలంగాణ జనాభాలో 97.4 శాతం మంది మాంసాహారం తింటున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన మాంసాహారం ఎక్కువగా తింటున్నట్టు సర్వేలో బయటపడింది నాగాలాండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా చేపలు తింటుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో చికెన్, మటన్‌తో పాటు చేపలు అధికంగా తింటున్నారు. ఒడిశాలో రొయ్యలు, త్రిపురలో పందిమాంసం, గోవాలో చేపలు, పీతల వంటి సీఫుడ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
తెలంగాణలో పెరుగుతున్న మాంసం డిమాండ్ ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో మటన్ ధర రూ.1,000 వరకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. తెలంగాణ మాంసం అవసరాల్లో దాదాపు 50 శాతం జంతువుల దిగుమతులపై ఆధారపడుతుందని నిపుణులు అంటున్నారు. దిగుమతులకు అంతరాయం ఏర్పడితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పశుసంపద కేవలం ఎనిమిది నెలల డిమాండ్‌ను మాత్రమే తీర్చగలదని.. దీనివల్ల ధరలు 50 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.