|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:20 PM
హైదరాబాద్ మహానగరంలో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా తాజాగా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, అల్వాల్ మండలం పరిధిలోని ఆర్వింద్ ఎన్‌క్లేవ్ వాసుల 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ప్రధాన రహదారిపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ప్రజల సౌకర్యం కంటే ఏదీ ముఖ్యం కాదని చాటిచెబుతూ.. 50 అడుగుల రహదారిని తిరిగి ప్రజలకు అప్పగించింది.
ఆర్వింద్ ఎన్‌క్లేవ్‌లోని రోడ్డు నంబర్ 4పై కొంతమంది ఇంటి యజమానులు ఏకంగా 50 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును ఆక్రమించి గదులు, ప్రహరీ గోడలు నిర్మించారు. దీనివల్ల కాలనీ వాసులు ప్రధాన రహదారికి చేరుకోవడానికి కేవలం 100 మీటర్లు నడవాల్సిన చోట.. దాదాపు కిలోమీటరున్నర దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. గత 15 ఏళ్లుగా స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. చివరకు ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది.
ప్రజల ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. శనివారం ఉదయమే బుల్డోజర్లతో రంగంలోకి దిగిన సిబ్బంది, రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడలను, అక్రమ గదులను నేలమట్టం చేశారు. ఈ రోడ్డు క్లియర్ అవ్వడంతో హర్ష హాస్పిటల్ కు అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు సులభంగా వెళ్లే అవకాశం కలిగింది. కాలనీ అంతర్గత రహదారులు ఇప్పుడు మెయిన్ రోడ్డుతో అనుసంధానమయ్యాయి.
ఈ చర్య ద్వారా హైడ్రా ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. ప్రభుత్వ భూములు, చెరువులే కాకుండా.. ప్రజలు నిత్యం వాడే రహదారులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని నిరూపించింది. ‘రోడ్డుపై గోడ కట్టి మా సొంతం’ అనుకునే ధోరణికి చెక్ పెట్టింది. 15 ఏళ్ల నాటి సమస్యను కేవలం కొన్ని గంటల్లో పరిష్కరించడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లు లేదా ప్లాటు కొనేముందు అక్కడ రోడ్లు, పార్కుల కోసం కేటాయించిన స్థలాలను అధికారిక లేఅవుట్ ద్వారా సరిచూసుకోవడం మంచిదని .. మీ పరిసరాల్లో ఎవరైనా రోడ్డును ఆక్రమిస్తే వెంటనే హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ లేదా ప్రజావాణికి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. అనుమతి లేని నిర్మాణాల వల్ల భవిష్యత్తులో మీ ఇల్లు కూడా హైడ్రా కూల్చివేతల పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.