|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 12:42 PM
జూబ్లీహిల్స్.. అపోలో ఆసుపత్రి ఔట్ గేట్‌కు ఎదురుగా ఇళ్ల మధ్య దాదాపు 2 ఎకరాల మేర పార్కు ఉంది. అక్కడ ఓ ఇంటిని కిరాయికి తీసుకుని లేడీస్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తికి.. ఆ పార్కు స్థలంపై కన్ను పడింది. ఇంకేముంది 150 గజాల మేర పార్కును ఆక్రమించేశాడు. కాంపౌండ్ దాటి పార్కులోకి 50 గజాల మేర జరిగి పాత భవనానికి ఆనుకుని మరో నిర్మాణం చేపట్టాడు. ఒక్కో అంతస్తులో 4 బెడ్లు పట్టినట్టు గదులు నిర్మించాడు. ఇంటి యజమాని కూడా ఈ కబ్జాలపై మౌనంగా ఉన్నాడు. పార్కు వైపు గేటు పెట్టి 100 గజాల మేర ఫార్మ్ హౌస్ మాదిరి సొంత పార్కును అభివృద్ధి చేసుకుని వాడుకుంటున్నాడు. అక్కడ చుట్టుపక్కల నివాసితులు ఊరుకోలేదు. పార్కు కబ్జాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో హైడ్రా పరిశీలించింది. పార్కులోకి 50 గజాల మేర జరిగి నిర్మాణం చేపట్టినట్టు నిర్ధారించుకుంది. మరో 100 గజాల మేర హద్దులు వేసుకుని ఆక్రమణ చేసినట్టు స్పష్టం చేసుకుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలతో బుధవారం 3 అంతస్తుల నిర్మాణాన్ని తొలగించారు. పార్కు కబ్జా ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫెన్సింగ్ వేశారు. కబ్జాకు పాల్పడినవారిపై పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు.