|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 07:58 PM
హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఉన్న చట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఆర్కేపురం ప్రాంతంలోని చట్నీస్ రెస్టారెంట్ కిచెన్‌లో ఉన్న ఇడ్లీ స్టీమర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకేసారి భారీ పేలుడు శబ్దం రావడంతో.. అందులో ఉన్న కస్టమర్లు భయంతో పరుగు పరుగున బయటకు వెళ్లిపోయారు. ఇక భారీ శబ్దంతో ఇడ్లీ స్టీమర్ పేలిన ఘటనలో అక్కడే ఉన్న సిబ్బందికి గాయాలు అయ్యాయి. హుటాహుటిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి తలకు బలమైన గాయమైనట్లు డాక్టర్లు వెల్లడించారు. మరో ఇద్దరు సిబ్బందికి.. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. ఇక చట్నీస్ హోటల్‌లో పేలుడు జరిగిందన్న సమాచారం తెలుసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడి కారణంగానే ఇడ్లీ స్టీమర్ పేలినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు.
మరోవైపు.. ఇడ్లీ స్టీమర్ పేలుడు జరిగిన కిచెన్‌ను ఎల్బీ నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ టీమ్స్ పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్ బాగా వేడెక్కడం వల్లే ఈ పేలుడు సంభవించిందా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
పేలుడుకు గల కచ్చితమైన కారణం ఏంటి అనేదానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఇడ్లీ స్టీమర్ పేలుడుతో హోటల్ సిబ్బందితోపాటు.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ పేలుడు ఘటనపై చట్నీస్ హోటల్ యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండా.. ప్రమాదాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని స్థానికులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.