by Suryaa Desk | Sun, Sep 22, 2024, 10:50 AM
జోగిపేట, అందోలు మండల పరిధిలోని తాలెల్మ గ్రామంలో శుక్రవారం వీధి ధీపాలు అమర్చే సమయంలో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన పంచాయితీ కార్మికుడు మన్నె లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు శనివారం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయు నాయకుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన జరిగిందని వారు ఆరోపించారు. మండల స్పెషల్ ఆఫీసర్ గీత, ఎంపిడీఓ రాజేష్‌కుమార్, ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాస్, ఎంపీఓ అశోక్‌కుమార్‌లు ఆసుపత్రి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. విద్యుత్ శాఖ నుండి రూ.5 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.2.30 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయడంతో పాటు గ్రామ పంచాయితీ నుండి రూ.2లక్షల నగదును అందజేస్తామని విద్యూత్, పంచాయితీరాజ్ శాఖల అధికారులు వ్రాత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
మంత్రి దిగ్బాంతి తాలెల్మ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న లక్ష్మయ్య కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. మృతుడిపై ఆధారపడి ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా తగు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. లక్ష్మయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు.