|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:33 PM
విద్యా వ్యవస్థలో క్రమశిక్షణ, పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. ఇవి రెండు లేకపోతే.. విద్యార్థుల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారుంది. అయితే ఈ రెండు ఎంత ముఖ్యమో తెలియజేసే ఒక కలవరపరిచే సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో జరిగింది. మండల విద్యాధికారి గా వ్యవహరించే వ్యక్తి.. ఆ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు. పాఠశాలల నిర్వహణ, బోధనా నాణ్యత, ఉపాధ్యాయుల హాజరు, ప్రభుత్వం నిర్దేశించిన విద్యా ప్రమాణాల అమలు వంటి కీలక బాధ్యతలను ఆయన నిర్వర్తిస్తారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా.. విధులను సక్రమంగా నిర్వహించేలా చూడటం వీరి ప్రధాన విధి.
తాజాగా ఇల్లెందు మండలంలో సుభాష్‌నగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న మండల విద్యాధికారి ఉమాశంకర్పై అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శంకర్ దాడి చేశాడు. రిజిస్టర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం వేయాల్సిన సంతకాన్ని ఉదయాన్నే వేయడం (ఫార్వార్డ్ సిగ్నేచర్) విద్యాధికారి ఉమాశంకర్ గమనించారు. ఈ క్రమశిక్షణారాహిత్యంపై ఆయన సదరు ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు.
విద్యాధికారి అభ్యంతరంపై ఆగ్రహించిన ఉపాధ్యాయుడు శంకర్.. వెంటనే అదుపు తప్పి అధికారిపై దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, కర్రతో దాడి చేయడంతో ఎంఈఓ ఉమాశంకర్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలోని ఉపాధ్యాయులు వెంటనే స్పందించి దాడిని అడ్డుకున్నారు. గాయపడిన విద్యాధికారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ దాడిపై ఎంఈఓ ఉమాశంకర్ స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంఈఓ జిల్లా విద్యాధికారికి (DEO) కూడా ఫిర్యాదు చేశారు. ఒక పర్యవేక్షక అధికారి తన విధుల్లో భాగంగా క్రమశిక్షణను పాటించాలని కోరినందుకు ఒక ఉపాధ్యాయుడు ఇలా దాడికి పాల్పడటం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
మండల విద్యాధికారి పదవి విద్యావ్యవస్థకు వెన్నెముక వంటిది. పాఠశాలల నిర్వహణలో.. బోధనలో ఏ చిన్న లోపం ఉన్నా దాన్ని సరిదిద్దే అధికారం, బాధ్యత ఎంఈఓలకు ఉంటుంది. ఉపాధ్యాయులు తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినా.. సమయపాలన పాటించకపోయినా.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఈ సంఘటన.. విద్యా శాఖలో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతను, పర్యవేక్షక అధికారుల పట్ల గౌరవం ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది.