|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 07:40 PM
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఒక శుభవార్త. ప్రముఖ ఆభరణాల తయారీ, విక్రయ సంస్థ అయిన కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక జాబ్ మేళాను నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులు ఇటువంటి అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి అధికారులు కోరుతున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థలో మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇది కేవలం అమ్మకాలు లేదా కస్టమర్ సర్వీస్ విభాగాలకే కాకుండా.. నిర్వహణ, లాజిస్టిక్స్ వంటి ఇతర విభాగాలకూ అవకాశం కల్పిస్తుంది.
మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేల్స్, కస్టమర్ రిలేషన్స్, ఇతర సహాయక విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా.. దరఖాస్తు చేసే అభ్యర్థి యొక్క అర్హతను ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. పురుషులు, స్ట్రీలు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో నెలకు రూ. 20,000 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు.
దీంతో పాటు, పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు, ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. నవంబర్ 18వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కళ్యాణ్ జ్యువెలరీ షో రూమ్, ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద ఈ జాబ్ మేళా ఉంటుందన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ దుస్తులు ధరించి రావాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతరం ఈ సువర్ణావకాశాన్ని అస్సలు వదులుకోవద్దని.. అర్హతలు ఉంటే ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఉపాధి అధికారులు చెప్పారు.