|
|
by Suryaa Desk | Tue, Feb 24, 2026, 06:30 PM
ఏ తల్లికైనా కడుపున పుట్టిన బిడ్డ అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. 9 నెలలు కడుపులో మోసి.. ప్రాణాలకు తెగించి భూమిపైకి తీసుకువస్తుంది. ఒక బిడ్డను కనేందుకు ఆ తల్లి.. ఎన్నో పురిటి నొప్పులు ఓర్చుకుంటుంది. కేవలం మనుషులే కాకుండా జంతువులు కూడా తమ బిడ్డలను కంటికి రెప్ప లాగా చూసుకుంటాయి. ఎంతటి ఆపద ఎదురైనా.. తమ ప్రాణాలను అడ్డు వేసి మరీ బిడ్డలను రక్షించుకుంటారు. అయితే అలాంటి తల్లే ఆ పసికందు పాలిట శాపమైంది. ఆ పసి బిడ్డ భూమి మీదికి వచ్చి 2 నెలలే అయినప్పటికీ ఆ కన్న తల్లి కనికరం లేకుండా కాల్చి చంపేసింది.
హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ ప్రాంతంలో జరిగిన ఈ అమానిుష ఘటన ఇప్పుడు తీవ్ర గుండెకోతగా మారింది. 2 నెలల బాలుడిని కన్న తల్లే అతి కిరాతకంగా హతమార్చింది. 2 నెలల బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి అతి దారుణంగా కాల్చి చంపింది. చంపేటపుడు ఆ పసికందు ఏడవకుండా ఉండేందుకు.. ఆ చిన్నారి నోట్లో బట్టలు కుక్కి.. కాళ్లను కట్టేసి మరీ దారుణంగా హత్య చేసింది. అయితే అది చూసిన స్థానికులు.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు.
దీంతో రంగంలోకి దిగిన దుండిగల్ పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. అయితే 9 నెలలు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బిడ్డను కన్న ఆ తల్లి.. అత్యంత దారుణంగా తన బిడ్డనే చంపడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బిహార్‌కు చెందిన భార్యాభర్తలు బౌరంపేటలోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్ వద్ద పనిచేస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఇక బాలుడి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇక 2 నెలల పసిబిడ్డను చంపేందుకు ఆ తల్లికి ఎలా మనసు వచ్చిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ తల్లి ఎందుకు తన కన్న బిడ్డను చంపేసిందో పోలీసులు తేల్చాల్సి ఉంది. చిన్న పసికందును అత్యంత దారుణంగా చంపేసిన తల్లిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే ఈ కేసులో మరిన్ని విషయాలను పోలీసులు తేల్చాల్సి ఉంది.