by Suryaa Desk | Sat, Sep 21, 2024, 08:35 PM
తెలంగాణలో రేవంత్ రెడ్డి అవినీతి కుటుంబ కథాచిత్రం నడుస్తోందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారంటూ కేటీఆర్ ఆరోపించారు. 8,888 కోట్ల రూపాయల అమృత్ పథకంలో టెండర్ల పేరుతో భారీ కుంభకోణం చేశారంటూ అందుకు సంబంధించిన వివరాలను.. మీడియాకు వివరించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగానే.. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ కుంభకోణం చేసినట్టుగా కేటీఆర్ ఆరోపించారు. ఈ భారీ స్కాంతో.. రేవంత్ రెడ్డి పదవి కోల్పోయే అవకాశం కూడా ఉందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినప్పటికీ.. వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టినట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని బెదిరించి.. ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ సంస్థ అయినా.. దాని వెనుక ఉన్నది మాత్రం రేవంత్ రెడ్డి బావమరిదేనని తెలిపారు. టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమరిది జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకు తెరలేపారన్నారు. 1137 కోట్లతో కాంట్రాక్టు దక్కించుకున్న అనంతరం.. ఆ కంపెనీ కేవలం 20 శాతం మాత్రం పని చేస్తుందని.. మిగతా 80 శాతం రేవంత్ రెడ్డి బావమరిదే చేపించనున్నట్టు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ భారీ కుంభకోణానికి తెరలేపినట్టుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టంలోని పలు నిబంధనల మేరకు రేవంత్ రెడ్డి విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చినట్టయింతే.. ఆశ్రితపక్షపాతం చూపించినట్టయితే.. ఈ చట్టాల ప్రకారం శిక్షార్హులేనని కేటీఆర్ వివరించారు. అయితే.. ఇవే చట్టాల కింద సోనియా గాంధీ తన పదవిని కోల్పోయినట్టుగా కేటీఆర్ గుర్తుచేశారు.
2006లో సోనియా గాంధీ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌గా పదవిలో ఉన్నందుకు ఈ చట్టం ప్రకారం తన పదవిని కోల్పోయిందని కేటీఆర్ వివరించారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప సైతం.. అక్రమ మైనింగ్ అనుమతులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు ఆయన తన పదవిని కోల్పోయినట్టుగా కేటీఆర్ గుర్తుచేశారు. మరోవైపు.. 2011లోనూ మహారాష్ట్ర సీఎం అశోక్ చవన్ కూడా ఆదర్శ కుంభకోణంలో తన పదవిని కోల్పోయినట్టుగా గుర్తు చేశారు కేటీఆర్.
బావమరిది కళ్లల్లో ఆనందం కోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నట్టుగా.. కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో పిలిచిన రూ.8888 కోట్ల టెండర్ల వివరాలను సర్కారు బయటపెట్టడం లేదన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ.. స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడటంతో.. ఈ వ్యవహారం బయటపడిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పెద్ద పెద్ద స్కాంలకు సంబంధించిన వివరాలను.. వరుసగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు.