by Suryaa Desk | Mon, Nov 11, 2024, 07:48 PM
హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో నగలు మాయమైన ఘటన కలకలం రేపింది. బీరువాలోని నగలు కనిపించటం లేదని పోలీసులకు సమాచారం అందగా..అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఇంటి వరండా ఆవరణలో ఉన్న చెత్తబుట్టలో బంగారు నగలు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని ఊపిరి పీల్చుకోగా.. అక్కడెవరు పెట్టారనేది ప్రశ్నగా మిగిలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసారాంబాగ్ డివిజన్ ఇందిరానగర్ ప్రాంతంలో ఓ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దెకు ఉంటోంది. కుటుంబ పెద్ద ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉంటున్నాడు. అయితే ఇంట్లో అతడి భార్య, రెండున్నరేళ్ల పాపతో పాటుగా అత్త, బావమరిది ఉంటున్నారు. ఆదివారం (నవంబర్ 10) ఉదయం ఇంట్లోని బీరువా ఓపెన్ చూసి చూడగా.. బంగారు నగలు కనిపించలేదు. దీంతో డయల్ 100కు కాల్ చేశారు. తమ ఇంట్లోని ఆరు తులాల బంగారు నగలు కనిపించటం లేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
మలక్‌పేట ఏసీపీ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్‌ఐలు ఇంట్లో వెతికారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటి వరండాలో ఉన్న చెత్తబుట్టను పరిశీలించారు. అందులో ఆ నగలు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ నగలు అక్కడకు ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. ఎవరైనా కావాలనే అందులో వేశారా..? లేక చూసుకోకుండా చెత్తబుట్టలో వేశారనేది అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై ఎటువంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.
గతేడాది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోనూ చెత్తబుట్టలో బంగారం ప్రత్యక్షమైంది. రూ.56 లక్షల విలువైన బంగారం చెత్తబుట్టలో కనిపించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. చెత్తబుట్టలో బంగారాన్ని దాచి అక్రమంగా ఎయిర్‌పోర్టు దాటించే ప్రయత్నం చేయగా.. అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.