|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:03 PM
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈసారి అంతర్జాతీయ వేదికగా మారింది. ఖండాంతరాల అవతలి నుంచి వచ్చిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు సోమవారం మేడారం సందర్శించి, తమ విశిష్ట సంప్రదాయాలతో వనదేవతలకు నీరాజనాలు పలికారు. రేపటి (28వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న మహా జాతరకు ముందు ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మార్పిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో చేపట్టిన ఇండో-న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఈ పర్యటన జరిగింది. ఈ సందర్భంగా మావోరీ బృందం ప్రదర్శించిన 'హకా' నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రాచీన కాలంలో యుద్ధానికి వెళ్లే ముందు గిరిజన యోధుల్లో ధైర్యాన్ని నింపేందుకు చేసే ఈ నృత్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి చిందులేసి వారిని ఉత్సాహపరిచారు. "గిరిజన సంస్కృతికి హద్దులు లేవు, ప్రకృతిని ప్రేమించే గుణం ప్రపంచంలోని అన్ని గిరిజన తెగలను ఒక్కటి చేస్తుంది" అని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.