|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 02:02 PM
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కాలుష్య రహితంగా మార్చేందుకు మూసీ ప్రక్షాళన.. పునరుజ్జీవనం కోసం నిర్మాణ తలపెట్టిన మురుగు నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభ పనులల్లో వేగం పెంచాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. నూతనంగా అమృత్- 2.0 పథకంలో భాగంగా నిర్మించే 39 ఎస్టీపీల ప్రాజెక్టు లో భాగంగా నిర్మిస్తున్న నార్సింగిలో నిర్మిస్తున్న 34.5 ఎమ్మెల్డీల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ప్యాకేజ్-1లో భాగంగా నార్సింగిలో నిర్మిస్తున్న ఎస్టీపీ పనుల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. మూసీ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎండీ.. ఎస్టీపీ నిర్మాణం జరుగుతున్న సమయంలో పక్కనే ఉన్న మూసీకి ఎలాంటి నష్టం లేకుండా చూడాలని సూచించారు. సమీప కాలనీల నుంచి మూసీలోకి మురుగు చేరే పాయింట్లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఈ మురుగు మూసీలో చేరకుండా, నది ఇరువైపు ఉన్న పైపు లైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించాలని ఆదేశించారు. అలాగే ఎస్టీపీ క్యాచ్ మెంట్ ప్రాంతాలైన కోకాపేట, నార్సింగిలతో పాటు ఎగువన, సమీప ప్రాంతాల్లో ఉత్పన్నం అయ్యే మురుగును కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించడానికి ఆయా ప్రాంతాల్లో సీవరేజ్ ట్రంక్ మెయిన్స్, సబ్ మెయిన్స్ నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ మళ్లింపు పనుల కోసం జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. అలాగే ఎస్టీపీ పనులు నిరంతం పాటు జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ఇందుకు తగ్గట్లుగా కార్మికులు, యంత్రాలు, నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తగు రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
నిర్ణీత సమయంలో పనులు 100 శాతం పూర్తి చేసి ఈ ఏడాది చివరి కల్లా ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా పనులు జరపాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణంలో రక్షణ చర్యలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలు ఉపయోగించాలన్నారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంగణాల చుట్టూ బారీకేడ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎంలు పద్మజ, వాస సత్యనారాయణ, జీఎం, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్ల వ్యయంతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పనులు ప్రారంభించింది.