|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 06:26 PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. గత కొంతకాలంగా రాజకీయంగా చురుగ్గా ఉంటున్న ఆయన.. అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటంతో పార్టీ శ్రేణులు, అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అస్వస్థతకు కారణం ఏమిటి?
జీవన్ రెడ్డి ప్రస్తుతం తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆహారం వికటించడం లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంట్లోనే ప్రాథమిక చికిత్స తీసుకున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది. అలాగే ఆయనకు డీహైడ్రేషన్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డి ఆసుపత్రిలో చేరారనే వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన.. ప్రజలతో మమేకమయ్యే నేతగా మంచి గుర్తింపు పొందారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు అందుతున్న చికిత్సపై నిమ్స్ వైద్యులు ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.