|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 06:17 PM
ఆమె వయసు 23. కానీ ఆ యువతే ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది. బీఫార్మసీ చేసి.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. తన తల్లిదండ్రులను పోషిస్తూ.. చెల్లిని చదివిస్తోంది. తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హుటాహుటిన ఆ యువతి హైదరాబాద్ నుంచి అనంతపురం బయల్దేరగా.. మార్గమధ్యలో బస్సు బోల్తాపడింది. ఆ ఘటనలో యువతి చేయి తెగిపడింది. పోలీసులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు కానీ.. విరిగిపడిన చేయిని మాత్రం ఘటనాస్థలంలోనే వదిలేశారు. ఆమెను చూసిన డాక్టర్లు.. 2 గంటల్లోగా విరిగిన చేయిని తీసుకొస్తే ఆపరేషన్ చేసి అతికిస్తామని చెప్పారు. కానీ ఆ చేయిని తీసుకురావడం ఆలస్యం కావడంతో ఆ యువతి ఇప్పుడు చేయి లేకుండానే బతకాల్సిన పరిస్థితి వచ్చింది.
దేవరకొండ స్నేహలత అనే 23 ఏళ్ల యువతి స్వస్థలం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గాంధీనగర్ గ్రామం. బీఫార్మసీ పూర్తి చేసిన స్నేహలత.. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. తల్లిదండ్రులు ఆదినారాయణ, లక్ష్మిలకు స్నేహలతనే ఆర్థికంగా దిక్కు. చెల్లెలు అక్షితను తనే ఇంటర్ చదివిస్తోంది. మీ అమ్మకు ఒంట్లో బాగోలేదని బుధవారం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అదే రోజు రాత్రి స్నేహలత బస్సులో అనంతపురం బయల్దేరింది. ఈ క్రమంలోనే ఆమె ప్రయాణిస్తున్న బస్సు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది.
అయితే బస్సు బోల్తాపడిన ఘటనలో స్నేహలత చేయి మణికట్టు వరకు తెగి ఘటనా స్థలంలోనే పడింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్నేహలతను కర్నూలు ఆస్పత్రికి పంపించారు. కానీ హడావుడిలో తెగిపడిన ఆమె చేతిని మాత్రం అక్కడే వదిలేశారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తెగిన చేతిని అతికించవచ్చని చెప్పడంతో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. తెగిపోయిన చేతిని తీసుకువస్తే ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని చెప్పారు. వెంటనే యువతి బంధువు ఘటనాస్థలికి వెళ్లి.. అక్కడి నుంచి చేతిని తీసుకొని కర్నూలు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. విరిగిన చేతిలోని కణాలన్నీ నిర్వీర్యమైనట్లు గుర్తించిన డాక్టర్లు.. దాన్ని అతికించడం కష్టమని తేల్చేశారు.
ప్రమాదం జరిగిన తర్వాత తమ కుమార్తెతోపాటే ఆమె చేయిని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించి ఉంటే.. ఆమెకు చెయ్యి వచ్చేదని, చిన్న పొరపాటుతో తమ కుమార్తె ఇప్పుడు శాశ్వతంగా దివ్యాంగురాలిగా మారిందని స్నేహలత తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు.. తాము ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ చేయించలేమని ఆర్టీసీ అధికారులు తెగేసి చెప్పడంతో ఆ యువతి కుటుంబం, బంధువులు.. అధికారుల వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో అయ్యే వైద్య ఖర్చులను తాము భరించలేమని యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.