|
|
by Suryaa Desk | Tue, Nov 11, 2025, 03:52 PM
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కమెడియన్స్ గా చాలామంది పాప్యులర్ అయ్యారు. అలా వెలుగులోకి వచ్చిన అభినయ కృష్ణ (అదిరే అభి), దర్శకుడిగా వ్యవహరించిన సినిమానే 'చిరంజీవ'. రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: శివ (రాజ్ తరుణ్) దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతని తల్లి గాయత్రికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటుంది. తండ్రి తాగుబోతు .. కుటుంబం పట్ల ఎంతమాత్రం బాధ్యత లేని వ్యక్తి. దాంతో శివ అంబులెన్స్ డ్రైవర్ గా కుదురుతాడు. అయితే ఆ పనిలోకి దిగిన తరువాతనే అందులోని సాధకబాధలు ఎలా ఉంటాయనేది అతనికి అర్థమవుతుంది. అదే కాలనీలో ఉండే భవ్య అతనిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇక అక్కడ స్థానిక నాయకుడిగా ఎదగడానికి శ్రీను యాదవ్ - సత్తు పహిల్వాన్ ఇద్దరూ ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసం వాళ్లిద్దరూ ఎమ్మెల్యే రాజన్న (రాజా రవీంద్ర) ను నమ్ముకుంటారు. శ్రీను యాదవ్ వడ్డీకి డబ్బులు తిప్పుతూ, రౌడీయిజంతో తిరిగి వసూలు చేస్తూ ఉంటాడు. ఇక సత్తు పహిల్వాన్ భూకబ్జాలు .. ఆక్రమణలకు పాల్పడుతూ ఉంటాడు. అక్కడి వాళ్లందరూ ఆ ఇద్దరికీ భయపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒకసారి శివకు యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పటి నుంచి అందరి తలలపై అతనికి ఏవో అంకెలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఎందుకు కనిపిస్తున్నాయనేది అతను పరిశీలిస్తాడు. ఎవరు ఏ రోజున ఏ సమయానికి చనిపోతారనేది తనకి ముందుగానే తెలిసిపోతున్నట్టు అతనికి అర్థమవుతుంది. ఆ శక్తిని అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించాలని అతను నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏమేం చేస్తాడు? అనేదే కథ.
Latest News