by Suryaa Desk | Sat, Jul 06, 2024, 07:56 PM
కొందరు మందుబాబులు.. మందు కొనుక్కునేందుకు రకరకాల పాట్లు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎలాగైనా మద్యం తాగాలనే కోరికతో మద్యం మత్తులో ఎలాంటి పనిచేయడానికైనా వెనుకాడరు. తాగిన మద్యం సరిపోలేదని.. మరింత తాగాలనే ఉత్సాహంతో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా రెచ్చిపోతూనే ఉంటారు. ఇలాంటప్పుడే నేరాలకు పాల్పడతారు. దొంగతనాలు, దోపిడీలు, బెదిరింపులు, హత్యల వరకు కూడా వెళ్లిన సంఘటనలు మనం ఎన్నో చూశాం. అయితే ఈ మందుబాబు వద్ద డబ్బులు ఉన్నా అవి ఏటీఎం మెషీన్ నుంచి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రెండు ఏటీఎంలలోకి వెళ్లి తన అకౌంట్లో ఉన్న డబ్బులు విత్ డ్రా చేద్దామని ప్రయత్నించినా.. వాటిలో డబ్బు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఆ రెండు ఏటీఎంలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది.
రామాయంపేటకు చెందిన షాదక్ అనే వ్యక్తి గురువారం రాత్రి మొదట మద్యం సేవించాడు. అయితే తన వద్ద డబ్బులు అయిపోవడంతో మరింత మద్యం కొనుగోలు చేసేందుకు తన అకౌంట్లో ఉన్న డబ్బులను విత్ డ్రా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సిద్దిపేట చౌరస్తాలో ఉన్న ఓ ఏటీఎంలోకి వెళ్లాడు. ఏటీఎం కార్డును మెషీన్లో పెట్టి పిన్ నంబర్ కొట్టగా.. ఆ ఏటీఎం మెషీన్లో డబ్బులు లేవని చూపించింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఆ షాదక్.. ఆ ఏటీఎం మెషీన్ను పగులగొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం పక్కనే ఉన్న మరో ఏటీఎం దగ్గరికి వెళ్లాడు.
అయితే ఆ ఏటీఎంలో కార్డు పెట్టి వివరాలు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కూడా డబ్బులు లేవని చూపించింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన షాదక్.. బయటికి వెళ్లి ఓ బండరాయి తీసుకువచ్చి.. ఆ ఏటీఎం మెషీన్ను ధ్వంసం చేశాడు. అయితే ఏటీఎం మెషీన్లు ధ్వంసం అయి ఉండటంతో సదరు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్సై రంజిత్.. మొదట గుర్తు తెలియని వ్యక్తి ఈ పని చేశాడని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఏటీఎంకు సమీపంలో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ పరిశీలించగా అసలు విషయం బయటికి వచ్చింది.
ఆ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసింది షాదక్ ఒక్కడే అని పోలీసులు గుర్తించారు. రెండు ఏటీఎంలలోకి వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినా.. రాకపోవడంతో వాటిని ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఇవన్ని దృశ్యాలు ఆ సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో నిందితుడు షాదక్ అని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గాలింపు చేపట్టిన పోలీసులు.. షాదక్ కోసం వెతుకుతున్నారు.