by Suryaa Desk | Thu, Nov 07, 2024, 04:03 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఇప్పుడు హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని రాయపోల్ బిజెపి మండల అధ్యక్షులు రాజాగారి రాజా గౌడ్ అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అలవిగాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలు అంటూ కాలయాపనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత 4 వేల పెన్షన్ ఇస్తామని, 2వేల పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని రెండు పర్యాయాలు ఇవ్వకుండా ఎగొట్టారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి బంగపాటు తప్పదనే ఉద్దేశంతో సంవత్సరం గడిచిన ఎన్నికల నిర్వహించడం లేదన్నారు. కులగణన, సమగ్ర కుటుంబ సర్వే అంటూ మరింత ఆలస్యం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులులేక గ్రామాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కనీసం చెత్త సేకరణ కూడా క్రమంగా జరగడం లేదన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మధ్యాహ్నం పూట నిర్వహించడం వలన గ్రామాలలో ప్రజలు ఇండ్లలో ఎవరు ఉండరని ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ వ్యవసాయ పనులకు వెళ్లిపోతారు. అలాంటప్పుడు ప్రభుత్వం చేపట్టే సర్వే విజయవంతం కాదన్నారు. ఉదయం పూటనే సర్వే నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి రవీందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు నరేష్ గౌడ్, ఓబిసి మండల అధ్యక్షులు స్వామి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షాదుల్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు.