by Suryaa Desk | Wed, Nov 06, 2024, 08:08 PM
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. అయితే ఈ ఒంటిపూట బడులు అన్ని స్కూళ్లకు కాదు. ప్రైమరీ స్కూళ్లు మాత్రమే సగం పూట నడవనున్నాయి. ప్రైమరీ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడపనున్నారు. తెలంగాణలో నేటి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగనుంది. నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ సర్వే కోసం స్కూల్ టీచర్ల సేవలు వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. 36,559 మంది ఎస్జీటీలు, 6,256 మంది ఎంఆర్సీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్స్ సహా వివిధ విభాగాల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్‌తో కలిపి పాఠశాల విద్యా శాఖ నుంచి మొత్తం 50 వేల మంది సిబ్బందిని ఎన్యుమరేటర్లుగా కుల గణనకు వినియోగించనున్నారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 18,241 ప్రైమరీ స్కూళ్లు సగం పూట మాత్రమే తెరుచుకోనున్నాయి. నేటి నుంచి ఈనెల 30 వరకు స్కూళ్లను ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపనున్నారు. నవంబర్ 30 తర్వాత యథావిథిగా స్కూళ్లు నడవనున్నాయి.
ప్రారంభమైన కుల గణన సర్వేఇక తెలంగాణ వ్యాప్తంగా కుల గణన ప్రారంభమైంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేను ప్రారంభించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సర్వే కోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 18 వేల మంది సూపర్ వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ఈనెల 8 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే సమాచారాన్ని ఇవ్వటంతో పాటు స్టిక్కర్స్ అంటించనున్నారు. నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను మొదలుపెట్టనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబ సమాచారం సేకరణ ఉండనుండగా.. అందులోనూ 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. రెండు పార్టులుగా పార్టు-1, పార్టు-2గా ఎనిమిది పేజీల్లో సర్వే పత్రాలను రెడీ చేశారు.