by Suryaa Desk | Wed, Nov 06, 2024, 04:55 PM
అర్హులైన దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందే విధంగా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిర్ధారణ శిబిరాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నవంబర్ 5, 6, 7 తేదీలలో జిల్లాలో దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కోసం ప్రత్యేక నిర్ధారణ శిబిరాలను 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రత్యేక నిర్ధారణ శిబిరానికి వచ్చిన ప్రతి దివ్యాంగుడికి అర్హత మేరకు అవసరమైన ఉపకారణాలు అందేలా వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, ప్రతి రోజు వడ్ల తేమ శాతం రికార్డు చేయాలని, ప్రమాణాల ప్రకారం 17 శాతం తేమ రాగానే వడ్లు కొనుగోలు చేయాలని అన్నారు.కొనుగోలు చేసిన వడ్ల వివరాలను వెంటనే ఓపి.ఎం.ఎస్ లో నమోదు చేస్తూ రైతులకు త్వరగా ధాన్యం డబ్బులు చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వర్షం వస్తే రైతులకు ధాన్యం నష్టపోకుండా వెంటనే టార్ఫాలిన్ కవర్లు అందజేయాలని కలెక్టర్ సూచించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్, మార్కెట్ సెక్రటరీ పృధ్వీరాజ్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.