by Suryaa Desk | Wed, Nov 06, 2024, 07:36 PM
హైదరాబాద్ మెట్రోలో సరికొత్త డిజిటల్ టికెటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ టికెట్ విధానాన్ని మంగళవారం (నవంబర్ 5) ఆవిష్కరించారు. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ, రూట్ మొబైల్, బిల్‌ఈజీతో కలిసి గూగుల్ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(RCS) ఆధారిత ఆధునిక డిజిటల్ టికెట్ సేవలను హైదరాబాద్ మెట్రోలో ప్రవేశపెట్టారు. హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్ అండ్‌టీ హైదరాబాద్ మెట్రోరైలు సీవోవో, రూట్ మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ జవార్, బిల్‌ఈజీ సీఈవో ఆకాశ్‌పాటిల్‌తో కలిసి కొండాపూర్‌లో ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
డబ్బులతో పని లేకుండా మొబైల్‌లోనే గూగుల్ వాలెట్ RCS ఆధారంగా టికెట్ బుక్ చేసుకోవచ్చని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. వీటితో పాటుగా త్వరలోనే డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డిజిటల్ పాసులు అందుటాబులోకి వస్తే.. మెట్రో కార్డులతోనూ పని ఉండదని చెప్పారు. ప్రపంచంలోనే ఈ తరహా సేవలు ఇవే మొదటివి అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 4 ట్రైన్లు అందించాల్సిందిగా... నాగ్‌పూర్ మెట్రోని కోరామని చెప్పారు. మెట్రోలో సాంకేతిక సమస్యలతో కొన్ని నిమిషాలు సేవలు నిల్చిపోవడం సహజమని ఇటీవల ఘటనపై ఆయన ప్రస్తావించారు.
'ప్రస్తుతం ప్రారంభించిన డిజిటల్ టికెటింగ్ విధానం రెండువారాల్లో అందుబాటులోకి వస్తాయి. స్టేషన్ల వద్ద క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి వాలెట్‌లో టికెట్ పొందవచ్చు. టికెట్ కౌంటర్ల వద్ద నిరీక్షణ తప్పుతుంది. కస్టమర్లకు మెట్రో సేవలు మరింత చేరువ చేసేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా దృష్టి సారించారు. ఎయిర్ పోర్టు వరకు నిర్మించే మెట్రో అన్ని స్టేషన్లకు అనుసంధానం చేస్తాం. అన్ని కారిడార్లను కలుపుతూ ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మిస్తాం.' అని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో 69 కి.మీ దూరంతో దేశంలో రెండో స్థానంలో ఉండేదని.. ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. కొత్తగా.. 76.4 కి మీ పొడవునా 24,2269 కోట్లు వ్యయంతో మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్ మెట్రో ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పారు.