by Suryaa Desk | Wed, Nov 06, 2024, 07:41 PM
మందుబాబులకు నిజంగా ఇది కిక్కు దిగిపోయే వార్తే. ఎందుకంటే త్వరలో తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. లిక్కర్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలకు ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కార్.. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా మద్యం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తెలంగాణలో మద్యం ధరలు పెంచొద్దని ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. పక్క రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఆ ధరలకు తగ్గట్లుగా తెలంగాణలోని లిక్కరద్ ధరల్లో మార్పులు చేయాలనే ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. లిక్కర్ ధరలను సగటున 20-25 శాతం మేర పెంచేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. బీర్పై రూ.15–20, క్వార్టర్‌పై రూ.10 -రూ.80 వరకు పెంచేలా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువగా పెంపు ఉండనుండగా.. ఇతర బ్రాండ్లపై ఎక్కువ బాదుడు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా ప్రతినెలా రూ.500 కోట్ల నుంచి రూ.700 మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తోంది.
ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2024-25)లో మద్యం అమ్మకాల వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేసింది. ఏప్రిల్ -సెప్టెంబర్ వరకు తొలి 6 నెలల్లో ఎక్సైజ్ శాఖకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్ ద్వారా రూ.8,040 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అంటే తొలి 6 నెలల్లో రూ.17,533 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. మరో 6 నెలల్లో ఇదే ఆదాయం వస్తే అనుకున్న టార్గెట్ పూర్తయ్యే ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో కొంత ధరలు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైన్స్లు, బార్లు, క్లబ్‌లు, పబ్‌ల ద్వారా ద్వారా రోజుకు సరాసరిగా రూ.90 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు సగటున రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడిస్తున్నారు. లిక్కర్ రేట్లు పెంచితే ఆ ఆదాయనికి తోడు.. ప్రతి నెలా దాదాపు రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.