by Suryaa Desk | Tue, Nov 05, 2024, 10:02 PM
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఉమ్మడి కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పట్టాభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా పార్టీల్లోని ఆశావాహులు టికెట్ కోసం ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. రాజకీయ నేతలే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధమవుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు తమ సర్వీసులను సైతం తృణప్రాయంగా వదులుకుంటున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గానూ.. గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ ఇప్పటికే తన ఉద్యోగానికి రాజీనామా చేయగా.. ఇదే పాటలో మరో పోలీస్ అధికారి కూడా నడవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న మదనం గంగాధర్.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గంగాధర్.. అత్యంత నిరుపేద కుటంబంలో జన్మించారు. 22 ఏళ్లకే తొలి ప్రయత్నంలో ఎస్సైగా ఎంపికై.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం డీఎస్పీ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వాహణలో గంగాధర్ చేసిన సేవలకు కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యంత్రి సర్వోన్నత పతకాలు పొందారు. ఇప్పటివరకు సుమారు 200 రివార్డులను గంగాధర్ తీసుకున్నారంటే.. వృత్తిపట్ల ఆయన ఎంత నిబద్ధతతో ఉన్నారన్నది అర్థమవుతోంది. ఇటీవల టీఎస్పీఎస్పీ పరీక్షల పేపర్ లీక్ కేసు విచారణలోనూ గంగాధర్ పాల్గొనటం గమనార్హం.
కాగా.. ఇన్నాళ్లు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సేవలందించిన గంగాధర్.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే సరైనవిగా భావించి.. తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. కాగా.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు గంగాధర్. అయితే.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.. లేదా ఏదైనా పార్టీ తరపున పోటీ చేస్తారా అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదే క్రమంలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లికి చెందిన ప్రొఫెసర్ పులి ప్రసన్న హరికృష్ణ కూడా ఏదైనా రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తారా.. లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అన్నది ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రధాన పార్టీల్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. అధికార కాంగ్రెస్ ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ లేదు.