by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:02 PM
గత ప్రభుత్వం మూడేళ్ల క్రితం మంజూరైన నిధులతో పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రస్తుతం చేపట్టబోయే రోడ్డు అభివృద్ది పనులపై దురుద్దేశంతో మాజీ ఎమ్మెల్యే ప్రకటనలు చేయడం మానుకోవాలని జోగిపేట ఏఎంసీ చైర్మన్ జగన్మొహన్‌రెడ్డి, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, చిట్టిబాబు, నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్, పట్టణ కాంగ్రేస్ నాయకుడు డీజీ వెంకటేశ్‌లు ఆరోపించారు. మంగళవారం జోగిపేటలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందోలు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మంజూరైన రోడ్లపై క్రాంతికిరణ్ మంత్రి దామోదర్‌పై చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ప్రతి సంవత్సరం అభివృద్ది పనులకు సంబంధించి అంచనాలు పెరగుతాయని ప్రతి సంవత్సరం 10 నుంచి, 12 శాతం ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెరగుతాయన్న విషయాన్ని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. అభివృద్ది పనులను అడ్డుకునేందుకు కుట్రలు చేయకూడదన్నారు.
నియోజకవర్గంలో మొత్తం రూ.25 కోట్లతో 34 కి.మీ పొడగునా 13 రోడ్లు అభివృద్ది చేసేందుకుగాను మంత్రి దామోదర్ నిధులు మంజూరు చేయించారన్నారు. రోడ్ల నిర్మాణంలో కాలానుగుణంగా అంచనాలు మారుతుంటాయన్న విషయాన్ని గమనించాలన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో సర్పంచ్‌లకు బిల్లులను చెల్లించకపోవడంతో ఎందరో అత్మహత్యలు చేసుకున్నా మాజీ మంత్రి హరీష్‌రావు వారితో కలిసి ధర్నాకు దిగడం సిగ్గుచేటన్నారు. మంత్రి బంధువుల కోసమే ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు పెంచారంటూ తప్పుడు ఆరోపణలు చేయడం కాదని, చిత్తశుద్ది ఉంటే నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్‌లు దుర్గేష్, చందర్ నాయక్, మాజీ వార్డు సభ్యుడు పి.ప్రవీణ్‌కుమార్, సీహెచ్. శివకుమార్, నాయకులు డి.శ్రీనివాస్, రాజశేఖర్, నాగయ్య, అనిల్, రాజు, నందు, అబ్బాస్ అలీ, నాగరాజ్, మాణిక్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు.