by Suryaa Desk | Wed, Nov 06, 2024, 03:10 PM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజా సొమ్మును ముఖ్యమంత్రి, మంత్రులు దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేకుల్లాగా కోసుకుని పంచేసుకుంటున్నారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ముందుకు వాస్తవాలు చెబుతానని.. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అవినీతిపై ఏం చేస్తుందని ప్రశ్నించారు.రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు, అవినీతిపై బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలు, కొడంగల్ ఎత్తిపోతల పథకం వంటి వాటిపై ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సాగునీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారు. వాయు వేగంతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ నిర్మించారు' అని కేటీఆర్ గుర్తుచేశారు.'రేవంత్ రెడ్డి తీరు రోజుకో మాట ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా మాట్లాడి దానికి విరుద్ధంగా పనులు చేస్తున్నాడు. మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిపోసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ కంపెనీపై చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టులు ఎందుకు అప్పగిస్తున్నారు?' అని కేటీఆర్ నిలదీశారు. 'హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చేందుకు సుంకిశాల ప్రాజెక్ట్ చేపడితే రేవంత్ ప్రభుత్వం పట్టించుకోలే. సుంకిశాలలో మేఘా కంపెనీ తీవ్ర నిర్లక్ష్యం కారణంగా కూలిపోతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని వివరించారు.
సుంకిశాల ఘటనలో మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను కట్టబెడుతున్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థపై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమేనని సంచలన ఆరోపణలు చేశారు.