by Suryaa Desk | Wed, Nov 06, 2024, 07:48 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కులగణన కోసం టీచర్లను ఉపయోగించడం, ఇందుకోసం ఈనెల 30 వరకు ఒక్కపూట బడులు నిర్వహించడం సరికాదన్నారు. ఇదో దిక్కుమాలిన ఆలోచన అని ధ్వజమెత్తారు.కులగణన కోసం మూడు వారాలపాటు ఒక్కపూట బడులు నిర్వహించడం ఏమిటన్నారు. మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే కనుక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని తెలిసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటన్నారు. టీచర్లు ఉన్నది చదువు చెప్పడానికా? లేక ప్రభుత్వ పనులు చేయడానికా? అని నిలదీశారు.ఓ వైపు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఇలాంటి వాటికి ఉపయోగించడం ద్వారా కాస్త ఊరట కల్పించవచ్చని అన్నారు. సామాజిక న్యాయం చేయడానికి తప్పనిసరిగా కులగణన జరగాలి... కానీ, అందుకు ఇతర టీచర్లను కాకుండా సంబంధిత శాఖలను ఉపయోగించుకోవాలన్నారు. కేసీఆర్ సీఎంగా ఒక్కరోజులోనే రాష్ట్రమంతా సమగ్ర కుటుంబ సర్వే చేశారని, కానీ ఈ ప్రభుత్వం బీసీల అంశాన్ని రాజకీయం చేసి కాలయాపన చేయడం కోసం కులగణన పేరుతో తంతు నడిపిస్తోందన్నారు