by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:39 PM
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామ శివారులోని నారాయణ కళాశాలలో వరంగల్ జిల్లా ఇన్నవోలు మండలం గరిమెళ్ళపల్లి గ్రామానికి చెందిన బాల బోయిన వైష్ణవి (16) కళాశాల హాస్టల్లో ఉంటూ ఎంపీసీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. సోమవారం సాయంత్రం హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కు చున్నితో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గుర్తించిన కళాశాల సిబ్బంది స్థానికంగా ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా వైష్ణవి మృతి పై కుటుంబీకులు, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన చేశారు. కళాశాల సిబ్బంది ఒత్తిడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందామని ఆరోపించారు. కళాశాల ప్రధాన గేటు ఎదుట కుటుంబీకులు బైఠాయించి రోదించారు. విద్యార్థి సంఘాల నాయకులు గేటు ఎదుట బైఠాయించి కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థిని మృతికి కళాశాల యాజమాన్యం తీరు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. కళాశాల యాజమాన్యం ఒత్తిడితోనే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని మండిపడ్డారు. కళాశాల వద్దకు విద్యార్థి సంఘాలు, కుటుంబీకులు, స్థానికులతో చేరుకోవడంతో జిన్నారం, బొల్లారం సిఐలు సుధీర్ కుమార్, గంగాధర్, ఎస్సైలు రాములు, నాగలక్ష్మి పోలీస్ సిబ్బందితో మొహరించారు. విద్యార్థిని తండ్రి పరశురామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బొల్లారం పోలీసులు వైష్ణవి మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబీకులకు అందజేశారు.