by Suryaa Desk | Wed, Nov 06, 2024, 05:44 PM
మల్యాల మండలం రైతు వేదిక, మల్యాల నందు విత్తన, పురుగుమందులు మరియు ఎరువుల డీలర్స్ సమావేశం మండల వ్యవసాయ అధికారి కే చంద్ర దీపక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే యాసంగి కాలమునకు సంబంధించి నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, గడ్డి మందులు మరియు రసాయనిక ఎరువులైనటువంటి యూరియా, డి ఏ పి, కాంప్లెక్స్ ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని సరుకులకు సంబంధించి కంపెనీ నుంచి బిల్లులు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ నందు పొందుపరచాలన్నారు.
రైతులకు నాణ్యమైన పురుగుమందులు, గడ్డి మందులు అవసరం మేరకే జాగ్రత్తగా విక్రయించాలని హెచ్చరించారు.రైతులకు విధిగా కొనుగోలు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. అంతే కాకుండా కాలం చెల్లిన ఎరువులను, పురుగు మందులను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని,అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎరువుల డీలర్స్, అధికారులు పాల్గొన్నారు.