|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 10:48 AM
జలమండలి.. బస్తీ బాట..!" కార్యక్రమం భాగంగా గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తా వద్ద సీవరేజ్ మరమ్మత్తు పనులను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. ఈ ప్రాంతంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఘనపదార్థాలు సీవరేజ్ లైన్లలో వదలడంతో మ్యాన్ హోళ్ళు తరచూ పొంగడం జరుగుతుంది. దానివల్ల ట్రాఫిక్ ఆటంకం ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు డీ-సిల్టింగ్ పనులు చేపట్టినా.. శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి.. నానల్ నగర్ నుంచి మెహిదీపట్నం వైపుగా ఉన్న మ్యాన్ హోళ్ళను అధికారులతో కలిసి పరిశీలించారు. ఫుట్ పాత్ అనుకుని ఉన్న మాన్ హోళ్లలోకి అక్కడక్కడ చెట్ల వేర్లు చేరి సమస్య పెంచిందని గుర్తించారు. దీంతో తాత్కలిత చర్యగా చెట్ల వేర్లను తొలగించి ధ్వంసమైన మ్యాన్ హోళ్ళను పునర్నిర్మాణం చేయాలని సూచించారు. అలాగే శాశ్వత పరిష్కరానికి ఈ ప్రాంతాల్లోని సీవరేజ్ లైన్లను సమీపంలోని జోన్-3 ట్రంక్ మెయిన్ కు మళ్ళించడానికి.. ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేస్తూ సీవరేజ్ నెట్‌వర్క్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సమీపంలోని హోటళ్లకు సిల్ట్ ఛాంబర్ నిర్మాణానికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. అనంతరం లంగర్ హౌజ్, అంబేద్కర్ నగర్ లో తాగునీటి సరఫరాపై స్థానికులతో మాట్లాడిన ఎండీ.. ప్రశాంత్ నగర్ లో కలుషిత నీటి ఫిర్యాదు పరిష్కార పనులను అధికారులతో సమీక్షించారు.
జోన్-3 పనుల పరిశీలన...
కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణకోసం చేపట్టిన జోన్-3 సీవరేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ పురోగతిలో ఉన్న పనులను, లంగర్ హౌజ్, టోలీ చౌకి ప్రాంతంలో పరిశీలించారు. లక్ష్మీనగర్ నాలా, ప్రశాంత్ నగర్, హుడా పార్క్ వద్ద నిర్మాణదశలో ఉన్న పనులను టన్నెలింగ్ పనులను పరిశీలించిన ఎండీ.. వీటితోపాటు జీహెచ్ఎంసీ రెయిన్ వాటర్ డ్రయిన్ సైతం ఏకకాలంలో నిర్మించేలాగా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. పనులు ముగిసిన వెంటనే ఎప్పటికప్పుడు రోడ్డు పునర్నిర్మాణం పనులు చేపట్టాలని, నివాస ప్రాంతాల్లో చేపడుతున్న టన్నెలింగ్ పనులలో సరైన రక్షణ చర్యలు చేపట్టాలని, తగు రీతిలో బారికేటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం లక్ష్మీ నగర్ నాలా వద్ద జలమండలి ఐఎన్ డీని సందర్శించారు. ఐఎన్ డీ ప్రాంగణంలో చెత్తాచెదారం తొలగించి శుభ్రంగా ఉండేలాగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక్కడినుంచి అంబర్ పేట్ వరకు వెళ్ళే ఎన్ఎస్ మెయిన్ సీవరేజ్ పైపు లైనును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ వినోద్ భార్గవ, సీజీఎం ప్రభు, జిఎంలు శ్రీను నాయక్, ఎస్ కుమార్, ఓఅండ్ఎం, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.