|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:18 PM
ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన, షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. తన భర్త, నటుడు రాజీవ్ కనకాలకు ప్రమాదం జరుగుతుందని తనకు ముందే కలలో కనిపించిందని, ఆ కల నిజమైందని ఆమె వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సుమ, తన కెరీర్‌తో పాటు రాజీవ్‌తో బంధం గురించి పలు విషయాలు పంచుకున్నారు.ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ, "నాకు కొన్నిసార్లు వచ్చే కలలు నిజమవుతుంటాయి. ఒకసారి రాజీవ్‌కు షూటింగ్‌లో యాక్సిడెంట్ అయి కాలు విరిగినట్లు కల వచ్చింది. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవు. ఆయన తలకోనలో షూటింగ్‌లో ఉన్నారు. ఒక రోజంతా ఆయన నుంచి ఫోన్ రాకపోవడంతో కంగారుపడ్డాను. తర్వాత ఫోన్ చేసి 'బానే ఉన్నావా?' అని అడగ్గానే, 'నిజంగానే నాకు కాలు విరిగింది. డ్రైవ్ చేస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది' అని రాజీవ్ చెప్పాడు. దీంతో నేను వెంటనే అక్కడికి వెళ్లి ఆయన్ను చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాను" అని సుమ వివరించారు. ఇలాంటి కలలు ఒక్కోసారి భయపెడతాయని ఆమె అన్నారు.ఇదే సమయంలో, తమ విడాకులపై ఎప్పటినుంచో వస్తున్న వదంతులపై కూడా సుమ స్పందించారు. తమ బంధం గురించి వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. "మా పెళ్లై 25 ఏళ్లు దాటింది. ఏ బంధంలోనైనా ఒడుదుడుకులు ఉంటాయి. మా జీవితం కూడా ఓ రోలర్‌కోస్టర్ లాంటిదే. కెరీర్, పిల్లలు, కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో మనస్పర్థలు రావడం సహజం. అయితే కొందరు మేం విడాకులు తీసుకున్నామని రాశారు. మేమిద్దరం కలిసి వీడియోలు పెట్టినా, 'ఏంటి మీరు ఇంకా కలిసే ఉన్నారా? విడిపోలేదా?' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొదట్లో బాధగా అనిపించినా, ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు" అని సుమ స్పష్టం చేశారు.
Latest News