|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 04:15 PM
'మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్' చిత్రాలతో తెలుగువారి మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. గత యేడాది దీపావళికి వచ్చిన 'లక్కీ భాస్కర్' తర్వాత దుల్కర్ నటించిన మరే చిత్రమూ ఇంతవరకూ విడుదల కాలేదు. యేడాది తర్వాత అతని సినిమా 'కాంత' జనం ముందుకు వచ్చింది. ఈ తమిళ చిత్రాన్ని దుల్కర్ తో కలిసి రానా దగ్గుబాటి నిర్మించాడు, తనూ నటించాడు. తెలుగులోనూ డబ్ అయిన 'కాంత' మూవీ శుక్రవారం విడుదలైంది. 1950 నాటి సినీ నేపథ్యంలో తెరకెక్కిన 'కాంత' ఎలా ఉందో తెలుసుకుందాం. 'కాంత' సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ బయటకు రాగానే ఇది తమిళనాడుకు చెందిన ఒకప్పటి స్టార్ హీరో ఎం. కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అనే ప్రచారం జరిగింది. తమిళ సినీ ప్రముఖుల జీవితాల నుండి స్ఫూర్తి పొంది ఈ కథను రాసుకున్నానని ఈ చిత్ర దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ చెప్పినా జనాలు నమ్మలేదు. త్యాగరాజ భాగవతార్ వారసులైతే సినిమా విడుదలకు ముందు దీన్ని నిలుపుచేయాలంటూ కోర్టు తలుపు తట్టారు. అయితే ఈ విన్నపాలు సినిమా విడుదలను ఆపలేకపోయాయి. మూవీ విడుదలైంది. దర్శకుడు చెప్పినట్టుగా ఇది ఒకరి బయోపిక్ కాదు... తమిళ సినిమా రంగంలో యాభై, అరవై యేళ్ళ నాడు జరిగిన కొన్ని సంఘటనల సమాహారం.కథ విషయానికి వస్తే దర్శకుడు అయ్య (సముద్రఖని) అనాథ అయిన టి.కె. మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ను స్టార్ హీరోగా తీర్చిదిద్దుతాడు. అతను తప్పటడులు వేసిన సమయంలో పక్కనే ఉండి మందలిస్తాడు. స్టార్ హీరోగా ఎదిగినా... తనను అయ్య తన చెప్పుచేతల్లో ఉంచుకోవడాన్ని మహదేవన్ సహించలేకపోతాడు. అదే సమయంలో అయ్య తన తల్లి విషాద జీవిత గాథను 'శాంత' పేరుతో తెరకెక్కించాలని చూస్తాడు. కానీ సెట్స్ లో మహదేవన్, అయ్య మధ్య వచ్చిన గొడవల కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. మోడ్రన్ స్టూడియోస్ అధినేత వారసుడు చొరవ చూపడంతో ఆగిన 'శాంత' మూవీ మళ్ళీ ఆరేడేళ్ళ తర్వాత సెట్స్ పైకి వస్తుంది. అయితే ఈసారి హీరో మహదేవన్ ఓ కండీషన్ పెడతాడు. తన స్టార్ డమ్ కు తగ్గట్టుగా ఈ సినిమా క్లయిమాక్స్ మార్చాలంటాడు. సినిమా పేరు శాంత కాకుండా 'కాంత'గా పెట్టాలంటాడు. అయ్య కేవలం సెట్స్ మీద ఉంటాడు తప్పితే, సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని మహదేవన్ చెబుతాడు. మూవీ రీ-ఓపెన్ అయిన తర్వాత అయ్య శిష్యురాలైన కుమారి (భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఎంపికవుతుంది. అయ్య, మహదేవన్ మధ్య కుమారి ఎలా నలిగిపోయింది? ఇగోస్ ను పక్కన పెట్టి 'కాంత' సినిమాను అయ్య, మహదేవన్ పూర్తి చేశారా? క్లయిమాక్స్ రోజు జరిగిన హత్యకు కారకులెవరు? పోలీస్ అధికారి ఫీనిక్స్ (రానా దగ్గుబాటి) హంతకులను పట్టుకోలిగాడా? అనేది మిగతా కథ.
Latest News